తాజావార్తలు

Ind Vs Pak: ఆజ్ సండే హై క్యా..? పాక్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన భారత మాజీ క్రికెటర్


Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిందంటే చాలు సోషల్ మీడియాలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హడావుడి మామూలుగా ఉండదు. గతంలో ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు ఎక్కువగా ఆదివారం నాడే జరగడం, ప్రతిసారీ పాక్ జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను ఉద్దేశించి ‘ఈ ఆదివారం ఎలా ఉంది’ అంటూ పఠాన్ సెటైర్లు వేస్తుండేవాడు. తాజాగా మహిళల ఆసియా కప్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత జట్టు దారుణంగా ఓడించడంతో పఠాన్ మళ్లీ విరుచుకుపడ్డాడు. మ్యాచ్ పూర్తయిన వెంటనే ‘ఆజ్ సండే హై క్యా’ అంటూ ఎక్స్ వేదికగా వేసిన ఒక్క ప్రశ్నకు పాక్ అభిమానులు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు.

55 పరుగులకే కుప్పకూలిన పాక్

మైదానంలో మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. భారత యంగ్ స్పిన్ ద్వయం శ్రీ చరణి, ప్రేమా రావత్ భయంకరమైన బౌలింగ్‌తో పాకిస్థాన్ బ్యాటింగ్ వెన్నుముక విరిచారు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ శ్రీ చరణి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, లెగ్ స్పిన్నర్ ప్రేమా 9 పరుగులకే 3 వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. దీప్తి శర్మ 5 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించగా, షెఫాలీ వర్మ ఒక వికెట్ దక్కించుకుంది. భారత బౌలర్ల ఉమ్మడి దాటికి పాకిస్థాన్ మహిళల జట్టు అంతర్జాతీయ టి20 చరిత్రలోనే తమ అత్యల్ప స్కోరైన 55 పరుగులకే చాపచుట్టేసింది.

సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన కెప్టెన్

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆరంభంలో షెఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9), ప్రతికా రావల్ (4) వికెట్లను త్వరగానే కోల్పోయింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఈ మూడు వికెట్లను పడగొట్టి కొంత ఒత్తిడి పెంచే యత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కెప్టెన్ గా 150వ టి20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన హర్మన్‌ప్రీత్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్)తో కలిసి జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చింది. హర్మన్‌ప్రీత్ విజయవంతంగా సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించడంతో భారత్ ఇంకా 68 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్న పఠాన్ ట్వీట్

గతంలో ప్రతి ఆదివారం పాకిస్థాన్ ఓడిపోవడం, ఆ తర్వాత పఠాన్ వేసే కౌంటర్లు ఒక ఆనవాయితీగా మారాయి. ఈసారి మ్యాచ్ శనివారం జరిగినప్పటికీ, ఓటమి పరాభవం మాత్రం పాక్‌కు ఆదివారం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసిందని పఠాన్ ఎద్దేవా చేశాడు. నెటిజన్లు పఠాన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా మీమ్స్ వర్షం కురిపిస్తూ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *