అడవిలో జీవుల మధ్య జరిగే పోరాటాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన పోరాటాల్లో ఒకటి ముళ్ల పంది, హనీ బ్యాడ్జర్ మధ్య వార్. అదే జరిగితే ఎవరు గెలుస్తారు? ఒకటి తన శరీరమంతా పదునైన ముళ్లతో రక్షణ పొందే జీవి కాగా, మరొకటి ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలు కలిగిన జంతువులలో ఒకటి. మరి తుది విజేత ఎవరు?
ముళ్ల పంది తన శరీరంపై 30,000కు పైగా గట్టి ముళ్లను కలిగి ఉంటుంది. ప్రమాదం ఎదురైనప్పుడు ముళ్లను నిక్కబొడుచుకుని శత్రువును హెచ్చరిస్తుంది. అవసరమైతే వెనక్కి దూసుకెళ్లి ప్రత్యర్థికి ముళ్లు గుచ్చే ప్రయత్నం చేస్తుంది. ముళ్లు బాణాల్లా విసిరేస్తుంది అని కొందరు అనుకుంటారు.. కానీ ప్రత్యర్థి తగిలితేనే అవి గుచ్చుకుంటాయి. పెద్ద సింహాలు, చిరుతలు కూడా ముళ్ల పందిని వేటాడేటప్పుడు చాలా జాగ్రత్త పడతాయి. అత్యవసర పరిస్థితి అనుకుంటే తప్ప దాని జోలికి పోవు. ఒకసారి ముళ్లు గుచ్చుకుంటే తీవ్రమైన గాయాలు కావచ్చు.
ఇక హనీ బ్యాడ్జర్ ప్రపంచంలో భీతి అన్నదే తెలియని జంతువులలో ఒకటిగా పేరు పొందింది. ఎదురుగా ఉన్నది ఎంత భయంకరమైన జీవి అయినా సరే.. ఇది వెనక్కి దగ్గదు. చాలా మందమైన, గట్టి చర్మం ఉండటం వల్ల చిన్న గాయాలను తట్టుకోగలదు. బలమైన దవడలు, పదునైన గోర్లు ఉంటాయి. విషపాములతో కూడా పోరాడి వాటిని వేటాడే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రమాదం వచ్చినా వెనక్కి తగ్గడం చాలా అరుదు.
పోరులో ఏం జరుగుతుంది?
హనీ బ్యాడ్జర్ దూకుడుగా దాడి చేసే అవకాశం ఉంది. అయితే ముళ్ల పంది వెంటనే తన ముళ్లను రక్షణగా నిలబెడుతుంది. బ్యాడ్జర్ జాగ్రత్త లేకుండా దాడి చేస్తే ముఖం, ఛాతీ లేదా కాళ్లకు ముళ్లు గుచ్చుకుని తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. అయితే వేటన్ మంచి అనుభమవున్న హనీ బ్యాడ్జర్ ముళ్ల మధ్య ఖాళీలు వెతికి దాడి చేయడానికి ప్రయత్నించవచ్చు. అయినప్పటికీ ఇది చాలా ప్రమాదకరమైన పని.
నిజ జీవితంలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ?
ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితమైన విజేతను చెప్పడం కష్టం. ఫలితం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ముళ్ల పంది తన రక్షణలో అసాధారణంగా బలంగా ఉంటుంది. హనీ బ్యాడ్జర్ దూకుడు, పట్టుదలలో అగ్రస్థానంలో ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, పూర్తి ఎదిగిన ఆరోగ్యవంతమైన ముళ్ల పందిపై హనీ బ్యాడ్జర్ దాడి చేస్తే గెలవడం అంత సులభం కాదు. ముళ్ల కారణంగా బ్యాడ్జర్ తీవ్ర గాయాలు పొందే ప్రమాదం ఎక్కువ. అందువల్ల ఇలాంటి పరిస్థితిలో ముళ్ల పంది తనను తాను విజయవంతంగా రక్షించుకునే అవకాశమే ఎక్కువ.
హనీ బ్యాడ్జర్ ఎంత ధైర్యవంతుడైనా, ముళ్ల పంది సహజ రక్షణ వ్యవస్థను ఛేదించడం చాలా కష్టం. అందుకే నేరుగా ఒకదానితో ఒకటి తలపడితే ముళ్ల పందికే స్వల్ప ఆధిక్యం ఉందని చెప్పవచ్చు. అయితే అడవిలో ప్రతి పోరాటం పరిస్థితులు, జంతువుల వయస్సు, పరిమాణం, అనుభవం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
