ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ కొండలలో వెలుగుచూసిన 7,000 సంవత్సరాల నాటి ప్రాచీన రాతి చిత్రాలను పరిరక్షించడానికి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కీలక ముందడుగు వేసింది. రాతి యుగం నుండి గుప్తుల కాలం నాటి ఆదిమానవుల జీవనం, ఏనుగులు, నీల్గాయ్ వంటి జంతువుల చిత్రాలు, ప్రాచీన డిజైన్లు ఈ గుహలలో ఉన్నాయి. గతంలో అక్రమ మైనింగ్ వల్ల దెబ్బతిన్న ఈ ప్రాచీన సంపదను కాపాడేందుకు ASI చర్యలు చేపడుతోంది.
ఫతేపూర్ సిక్రీ సమీపంలోని రసూల్పూర్, మదన్‌పురా, పత్సాల్, జాజౌలీ ప్రాంతాలలో విస్తరించి ఉన్న కొండలలో ఈ ప్రాచీన గుహలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చీల్ కీ గుఫా, నాయీ కీ గుఫా వంటివి అత్యంత ప్రధానమైనవి. ఈ గుహలలో ఆదిమానవులు సహజ సిద్ధమైన రంగులు, కాషాయం ఉపయోగించి గోడలపై వేసిన చిత్రాలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. మదన్‌పురా గుహలలో దంతాలు ఉన్న ఏనుగులు, నీల్గాయ్, ఎద్దుల చిత్రాలు ఉండగా, రసూల్పూర్ గుహలలో అత్యంత సంక్లిష్టమైన ప్రాచీన డిజైన్లు దర్శనమిస్తాయి. ఇవి ప్రసిద్ధ మధ్యప్రదేశ్ భీంబెట్కా రాతి చిత్రాలను గుర్తుచేస్తున్నాయి.
1980ల కాలంలో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ కుమార్ ఈ కొండల్లో దాదాపు 24 అరుదైన గుహలను కనుగొన్నారు. అయితే, కాలక్రమేణా జరిగిన అక్రమ మైనింగ్, రాళ్ల తవ్వకాల కారణంగా ఈ గుహలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తదనంతరం సుప్రీంకోర్టు కఠిన నిర్ణయాలు తీసుకుని మైనింగ్‌పై నిషేధం విధించడంతో మిగిలిన గుహలు నాశనం కాకుండా నిలిచాయి. అయినప్పటికీ సరైన సంరక్షణ లేక ఇవి కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో ఆగ్రా సర్కిల్ పరిధిలో రాతి యుగానికి చెందిన విరాసత్ను రక్షించడానికి ఏఎస్ఐ ముందడుగు వేసింది. ఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ గుహలను జాతీయ రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఆ తర్వాత ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది. తుది ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ 7,000 ఏళ్ల నాటి రాతి యుగం సంపదకు ప్రభుత్వ అధికారిక రక్షణ లభిస్తుంది, దీనివల్ల రాబోయే తరాలకు మన ప్రాచీన మానవ చరిత్ర భద్రంగా అందుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
