తాజావార్తలు

ఒకే ఓవర్లో 27 పరుగులు.. ఉతికారేసిన ఓపెనర్స్.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!


అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఆరంభం నుంచే పూర్తి దూకుడు ప్రదర్శించింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన సీనియర్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు పూర్తిగా ఊచకోత కోశారు. తొలి బంతిని అభిషేక్ శర్మ 93 మీటర్ల భారీ సిక్సర్‌గా మలచగా, రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చారు. ఆ తర్వాత స్ట్రైకింగ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు. మూడో బంతిని స్లాగ్ స్వీప్ చేస్తూ స్క్వేర్ లెగ్ మీదుగా 71 మీటర్ల సిక్సర్ బాదిన ఆయన, ఆపై వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టారు. ఆఖరి బంతికి స్ట్రెయిట్ బౌండరీ మీదుగా మరో భారీ సిక్సర్ కొట్టడంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 27 పరుగులు వచ్చి చేరాయి.

ఈ దెబ్బతో భారత స్కోరు పవర్‌ప్లే ముగిసే సమయానికి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం 19 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 47 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువయ్యారు. మరోవైపు అంతే ధాటిగా ఆడిన అభిషేక్ శర్మ 19 బంతుల్లో 39 పరుగులు చేసి ఏడో ఓవర్ రెండో బంతి వద్ద రషీద్ ఖాన్ (Rashid Khan) బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. 6.2 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 88 పరుగుల పటిష్ట స్కోరును నమోదు చేసింది.

తొలి వికెట్ పడిన తరువాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నారు. జట్టులో తన స్థానంపై వస్తున్న విమర్శలకు శాంసన్ ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో బలమైన సమాధానం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *