
2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ఏకే-47 తుపాకులతో ముంబైలోని కీలక ప్రాంతాలపై దాడులకు పాల్పడగా.. ఈ ఘటనలో సుమారు 160 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది భారత చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రదాడుల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ దాడిలో పట్టుబడిన ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష విధించగా.. 2012 నవంబర్ 21న పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో అతన్ని ఉరితీశారు.
అయితే, అజ్మల్ కసబ్ తరఫున వాదించేందుకు సొంత లాయర్లు ఎవరూ లేకపోవడంతో.. కేసు వాదించేందుకు అమిన్ సోల్కర్, ఫర్హానా షా అనే ఇద్దరు న్యాయవాదులను మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ఈ ఇద్దరు లాయర్లు కసబ్ తరఫున బాంబే హైకోర్టులో సుమారు తొమ్మిది నెలల పాటు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కసబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై వీరిద్దరూ కోర్టులో వాదించారు.
పారితోషికం చెల్లింపులో జాప్యం
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, వీరిద్దరికీ ప్రభుత్వం రోజుకు రూ.1,500 నుంచి రూ.2,000 మధ్య ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే హైకోర్టు విచారణ ముగిసి 15 ఏళ్లు దాటినా తమకు ఇంకా ఫీజులు అందలేదని ఆ ఇద్దరు న్యాయవాదులు చెబుతున్నారు. ఈ విషయంపై అమిన్ సోల్కర్ పలుమార్లు మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు.
తమకు రావాల్సిన ఫీజు డబ్బుల గురించి అడిగితే.. కోర్టుకు హాజరైన తేదీలు, ఎన్ని గంటలు వాదించారనే పూర్తి వివరాలతో కూడిన బిల్లులు, మెమోలు సమర్పించాలని అధికారులు అడుగుతున్నట్లు వారు చెబుతున్నారు. కేసు పూర్తయిన ఇన్నేళ్ల తర్వాత ప్రతిరోజూ కోర్టులో గడిపిన గంటల వివరాలను సమర్పించమనడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, తమను నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఫీజు గురించి స్పష్టంగా ఉందని.. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల్లోనూ ఫీజుల వివరాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసు కోసం 9 నెలల పాటు తమ పూర్తి సమయాన్ని కేటాయించామని, ఇతర కేసులను కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని ఫర్హానా షా చెప్పారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తమకు పారితోషికం చెల్లించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు వివరించారు. అయితే, న్యాయవాదులు తమ ఫీజులు పొందాలంటే సాధారణ విధానం ప్రకారం అధికారిక బిల్లులు, మెమోలు సమర్పించాల్సిందేనని రాష్ట్ర న్యాయ సేవల సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
