తాజావార్తలు

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25న ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు


Andhra Pradesh Weather Update Telugu: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్‌టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెప్టెంబర్ 25న (శుక్రవారం) ఒక రోజు సెలవు ప్రకటించింది.

ఈ మేరకు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థులు విద్యాసంస్థలకు రాకపోకలు సాగించే సమయంలో ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 25న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆరెంజ్ అలర్ట్ :

రాబోయే 3 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరోవైపు, తీవ్రవాయుగుండం ప్రస్తుతం పార్వతీపురానికి 60 కిమీ, ఒడిశాలోని భవానిపాట్నకు 90కిమీ, జగదల్పూర్ (ఛత్తీస్‌గఢ్) కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాత్రికి వాయుగుండంగా, ఆ తదుపరి 24 గంటల్లో క్రమంగా మరింత బలహీన పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం (25-09-2026) ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు; కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తెలిపింది.

ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాజ్ వేలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు అధికారులు. సహాయక చర్యలకోసం ప్రభావిత జిల్లాల్లో 8 ఎస్డీఆర్ఎఫ్, 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *