చెన్నైపై లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షం ఆదివారం నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉత్తర చెన్నైలోని ప్యారీస్ ప్రాంతంలో 24 గంటల్లో ఏకంగా 36.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.పలు ప్రాంతాల్లో 11.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షానికి నగరవ్యాప్తంగా పది ప్రాంతాలకు పైగా చెట్లు నేలకూలాయి. తిరువొత్తియూర్, టీ.నగర్, అశోక్నగర్, గిండీ, వేలచ్చేరి సహా పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గిండీలోని మాస్క్ కాలనీలో 16వ వీధిలో ఓ భారీ చెట్టు ఇంటిపై పడింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వేలచ్చేరి సమీపంలోని సంతోషపురంలోనూ చెట్టు నేలకూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి చెట్లను తొలగించారు. మరోవైపు కుండపోత వానతో ప్రభుత్వ కార్యాలయాలకూ వరద కష్టాలు తప్పలేదు. ఐటీ, జీఎస్టీ కార్యాలయాల పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపించారు. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రభుత్వం భారీగా సిబ్బందిని రంగంలోకి దించింది.
దాదాపు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 650కు పైగా విద్యుత్, ట్రాక్టర్ బేస్డ్ పంపులను వినియోగిస్తున్నారు. సహాయక చర్యల కోసం తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. NDRF , SDRF బృందాలతో నిరంతరం సహాయక చర్యలు చేపట్టాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభంలోనే చెన్నైలో ఈ స్థాయిలో వర్షం కురవడం స్థానికులను మరింత భయపెడుతోంది.
ఇదిలా ఉండగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం భారీ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
