బలగం చిత్ర ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు జరిగిన సరదా సంఘటనను కావ్య పంచుకున్నారు. దిల్‌రాజ్ కార్యాలయానికి సాధారణ జీన్స్, టీ-షర్ట్‌తో వెళ్ళినప్పుడు, దర్శకుడు వేణు “ఇలా కాదు, కుర్తీ వేసుకుని, దుపట్టాతో ఊర్లో అమ్మాయిలా రావాలి” అని చెప్పారంట. తిరిగి ఇంటికి వెళ్లి ఆయన సూచనల మేరకు సిద్ధమై వెళ్ళినప్పుడు కూడా, “ఇప్పుడు కొంచెం నా క్యారెక్టర్ లాగా ఉన్నావ్” అని వేణు అన్నారని ఆమె తెలిపారు. తాను సాధారణంగా మొదటిసారి దర్శకులను కలిసినప్పుడు మేకప్ వేసుకోనని, దర్శకుడు ఏ లుక్ కోరితే అది చేయడానికి సిద్ధంగా ఉంటానని కావ్య స్పష్టం చేశారు. బలగం సినిమాకు తన తెలంగాణ యాస, నటన నచ్చినప్పటికీ, తన లుక్ ఊర్లో అమ్మాయి పాత్రకు సరిపోవడం లేదని దర్శకుడు తొలుత భావించారని, అయితే తర్వాత దాన్ని సరిచేసుకున్నారని కావ్య వివరించారు.
