ముందుగా ఒక పాన్‌లో ఒక టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని, చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. పప్పు వేయించడం వల్ల హల్వాకు మంచి రుచి, కమ్మటి వాసన వస్తుంది. పప్పును మాడకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత వీటిని కుక్కర్లోకి తీసుకోవాలి.
కుక్కర్లోకి తీసుకున్న పెసరపప్పును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. మూడు గ్లాసుల నీళ్లు పోస్తే ముద్దగా అవుతుంది కాబట్టి, కాస్త పల్చగా రావడానికి అదనంగా ఒక గ్లాసు నీళ్లు కలుపుకోవాలి. కుక్కర్‌కు మూత పెట్టి, మధ్యస్థ మంటపై మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి.
విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి, ఉడికిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు కూడా. మెత్తగా ఎనిపిన పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి, అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు – ఒక టీ గ్లాస్, నీళ్లు – నాలుగు గ్లాసులు, నెయ్యి – అర గ్లాసు కంటే కొద్దిగా తక్కువ,
రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు, గోధుమపిండి – ఒక టేబుల్ స్పూన్, చక్కెర – రెండు గ్లాసులు, యాలకులు – నాలుగు (దంచి పెట్టుకోవాలి), రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు తీసుకోవాలి.
అదే నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసి, చిన్న మంటపై బాగా వేయించాలి. గోధుమపిండి రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది హల్వాకు బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గోధుమపిండి వేగిన తర్వాత, ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. మంటను చిన్న నుండి మీడియం స్థాయికి మార్చి, కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. పప్పు కాస్త చిక్కబడుతుంది.
మిశ్రమం చిక్కబడుతూ ఉండగా, మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. హల్వా మరింత చిక్కబడిన తర్వాత, ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో రెండు గ్లాసుల చక్కెర వేసుకోవాలి. బెల్లంతో కూడా ఈ హల్వాను చేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత మంటను తగ్గించి, చక్కెర పూర్తిగా కరిగి, హల్వా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగిన తర్వాత మిశ్రమం కొద్దిగా పల్చబడుతుంది, కానీ కలుపుతూ ఉంటే మళ్ళీ చిక్కబడుతుంది. మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వా చిక్కబడిన తర్వాత, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. హల్వా గట్టిపడిన తర్వాత, మరొక టేబుల్ స్పూన్ నెయ్యి, దంచిన నాలుగు యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి పాన్ అంచుల నుండి విడిపోవడం, హల్వా పాన్‌కు అంటుకోకుండా రావడం మొదలుపెడుతుంది. హల్వా రెడీ స్టవ్ ఆపి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.





