ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులతోపాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉపరితల ఆవర్తనం నుండి మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటు ఈశాన్య రుతుపవనాల రాకతో సోమవారం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
గురువారం (15-10-2026) : మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా కలుగుర్తిపాడులో 39.9మిమీ, చిట్టమూరులో 39.4 మిమీ, విశాఖ జిల్లా పద్మనాభంలో 35.2మిమీ, తిరుపతి జిల్లా కొత్తగుంటలో 33.6మిమీ, విజయనగరం జిల్లా డెంకాడలో 29.7మిమీ, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 28మిమీ, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 27.5మిమీ, నెల్లూరు జిల్లా చింతవరం, గూడూరులో 26మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.
తెలంగాణలో భారీ వర్షాలు..
తెలంగాణలో నేటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. వర్షాలతోపాటు గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో పాటు.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్కు వర్ష సూచన చేసింది.
పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
