తాజావార్తలు

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా? తింటే ఏమవుతుంది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!


జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. జ్వరంలో గుడ్డు తింటే కామెర్లు వస్తాయని కూడా ప్రచారం ఉంది.. కానీ, వైద్యుల ప్రకారం, జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినడం పూర్తిగా సురక్షితమే. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ సమయంలో కణజాలాలను రిపేర్ చేయడానికి, శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి చికెన్‌లో ఉండే అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లు ఎంతో తోడ్పడతాయి.

జ్వరం వచ్చినప్పుడు శరీరంలో జీర్ణశక్తి గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల సాధారణ రోజుల్లో వండుకునేలా ఎక్కువ కారం, మసాలాలు, నూనె లేదా నెయ్యి వేసి దట్టించిన చికెన్ ఫ్రై, బిర్యానీ, చికెన్ లాపాప్ వంటివి అస్సలు తినకూడదు. ఇవి జీర్ణవ్యవస్థపై భారం పెంచి అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి.

జ్వరంతో బాధపడుతున్న వారికి వేడివేడి చికెన్ సూప్ అమృతంలా పనిచేస్తుంది. ఇది సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరానికి కావాల్సిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను అందించి శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి నుంచి కూడా ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి



చికెన్ శరీరానికి మంచిదే అయినప్పటికీ, జ్వరం తగ్గే వరకు తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఉడకబెట్టిన చికెన్ లేదా తక్కువ మసాలాతో ఇంట్లో వండిన తేలికపాటి చికెన్ కూరను మాత్రమే ఎంచుకోవాలి.
జ్వరం ఉన్నప్పుడు కోడిగుడ్డు తింటే కామెర్లు వస్తాయనే ప్రచారం సమాజంలో ఉంది. కానీ, ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఉడకబెట్టిన గుడ్డును నిరభ్యంతరంగా తినవచ్చు. ఆరోగ్యకరమైన పద్ధతిలో చికెన్ తీసుకోవడం వల్ల జ్వరం నుంచి త్వరగా కోలుకోవడానికి అవసరమైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *