తాజావార్తలు

కన్న కొడుకి కర్కశం.. వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేసిన కొడుకు..!


కరీంనగర్: వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుమారుడితోనే ఆస్తి వివాదం తలెత్తడంతో ఓ వృద్ధ దంపతులు ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. ‘‘ఈ వయసులో మేమెక్కడికి వెళ్లాలి.. మా పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయండి’’ అంటూ వారు అధికారులను వేడుకున్నారు. కోతిరాంపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దేవులపల్లి లక్ష్మణ్‌ 2010లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు కుమారుడు రవికుమార్‌, కుమార్తె ఉన్నారు. రవికుమార్‌ హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు సుమారు రూ.8 లక్షల వరకు వేతనం వస్తుందని వృద్ధ దంపతులు తెలిపారు. కరీంనగర్‌ కోతిరాంపూర్‌లో లక్ష్మణ్‌ 2002లో నిర్మించుకున్న ఇంటిని అనంతరం తన కుమారుడు రవికుమార్‌ పేరున గిఫ్ట్‌ డీడ్‌ చేసినట్లు వారు చెప్పారు. అయితే 2023 నుంచి ఆ ఇంటిని విక్రయించాలని కుమారుడు చెబుతున్నాడని, ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

ప్రస్తుతం ఆ ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయమే తమకు ప్రధాన ఆధారమని దంపతులు తెలిపారు. వృద్ధాప్యంలో ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తే తాము ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య జయలక్ష్మి గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని లక్ష్మణ్‌ తెలిపారు. తమకు ఆధారంగా ఉన్న ఇంటిపై చేసిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి, వృద్ధాప్యంలో తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. కుమారుడితో ఏర్పడిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, గిఫ్ట్‌ డీడ్‌ విషయంలో చట్టపరమైన అంశాలు, ఇరువర్గాల హక్కులు, వివాదానికి సంబంధించిన ఇతర వివరాలు అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. వృద్ధ దంపతుల ఆరోపణలపై కుమారుడి స్పందన కూడా తెలియాల్సి ఉంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *