తాజావార్తలు

నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..


సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకు కనీసం ఒక్కసారైనా మనకు దర్శనమిచ్చే పదాలు నిబ్బా, నిబ్బి. ఫేస్‌బుక్ మీమ్ పేజీల నుండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకు ఎక్కడ చూసినా ఈ రెండు పదాల హడావిడి మామూలుగా లేదు. వింతగా.. కాస్త కామెడీగా వినిపించే ఈ పదాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి? గూగుల్ డిక్షనరీల్లోనూ దొరకని ఈ పదాలు రాత్రికి రాత్రే యువతరం వాడుక భాషగా ఎలా మారాయో చాలా మందికి తెలియదు. ఈ నిబ్బా లేదా నిబ్బి అనేది ఏ భారతీయ భాషకు చెందిన పదాలు కావు. హిందీ, ఇంగ్లీష్ లేదా బెంగాలీ డిక్షనరీలో వెతికినా ఇవి మీకు కనిపించవు. ఈ పదం అసలు మూలం అమెరికన్ పాప్ సంస్కృతిలో, ఆఫ్రికన్-అమెరికన్ వర్నాక్యులర్ ఇంగ్లీష్‌లో దాగి ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో నల్లజాతీయులు తమలో తాము ఆత్మీయతను వ్యక్తం చేయడానికి ఒక జాత్యహంకార పదాన్ని వాడుతుంటారు. అయితే దీనిని ఇతరులు ఉచ్చరించడం అక్కడ తీవ్రమైన నేరంగా, జాత్యహంకార వివక్షగా పరిగణించబడుతుంది.

ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ తెచ్చిన మార్పు

అంతర్జాతీయ ఇంటర్నెట్, గేమింగ్ ప్రపంచంలో ఈ నిషిద్ధ పదాన్ని నేరుగా వాడితే అకౌంట్లు బ్యాన్ అవుతాయి. ఈ సెన్సార్‌షిప్ నుండి తప్పించుకోవడానికి, సరదా కోసం నెటిజన్లు ఆ పదాన్ని కాస్త వక్రీకరించి నిగ్గా నుండి నిబ్బాగా మార్చేశారు. మొదట్లో కేవలం స్నేహపూర్వక సంబోధనగా లేదా సరదా మీమ్స్ కోసం విదేశీ మీమర్స్ దీనిని ఉపయోగించేవారు.

ఇండియాలోకి ఎంట్రీ.. మారిన అర్థం..

అమెరికన్ మీమ్ పేజీల ద్వారా భారతీయ ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత ఈ పదం రూపురేఖలు, అర్థం పూర్తిగా మారిపోయాయి. భారతదేశంలో ఇది “టీనేజర్ల అపరిపక్వ ప్రేమను” వ్యంగ్యంగా విమర్శించే ఒక శక్తివంతమైన సాధనంగా అవతరించింది.

ఎవరీ నిబ్బా-నిబ్బిలు?

పరిచయమైన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో ‘‘నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను’’ అంటూ స్టేటస్‌లు పెట్టేవాళ్లు.. చాలా చిన్న వయసులోనే ఒకరినొకరు బేబీ, జానూ, మై వైఫ్, మై హబ్బీ అని పిలుచుకుంటూ అతిగా ప్రవర్తించేవారిని నెటిజన్లు పిలిచే పేరే ఈ నిబ్బా-నిబ్బి.

అపరిపక్వ ప్రేమకు డిజిటల్ ట్యాగ్..

ప్రేమలో లోతు కంటే చౌకబారు భావోద్వేగాలు, సోషల్ మీడియాలో ఆర్భాటపు పాపులారిటీ, నాటకీయత ఎక్కువగా ప్రదర్శించే జంటలను నెటిజన్లు ఈ పేరుతో ట్రోల్ చేస్తుంటారు. కాబట్టి రోడ్డు పక్కనో లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనో ఒక జంట అతిగా, విచిత్రంగా ప్రవర్తించడం చూసి ఎవరైనా నిబ్బా నిబ్బి అని నవ్వుకుంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో అపరిపక్వ ప్రేమకు డిజిటల్ రూపంలో ఇచ్చిన బ్రాండ్ నేమ్ ఇది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *