తాజావార్తలు

Hyderabad: 8 గజాల స్థలంలో 2 అంతస్థుల బిల్డింగ్.. మామూలు ప్లానింగ్ కాదు సామీ.. లోపలికెళ్లి చూస్తే..


మహానగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం సామాన్యులకు పెను సవాలుగా మారుతోంది. ఆకాశాన్నంటుతున్న స్థలాల ధరలు, భారంగా మారుతున్న ఇంటి అద్దెల నడుమ తక్కువ బడ్జెట్‌లో సొంత గూడు నిర్మించుకోవడానికి సరికొత్త ఇంజనీరింగ్ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. స్థలం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు.. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే కొద్దిపాటి స్థలంలోనే అద్భుతమైన ఇంటిని నిర్మించవచ్చని నేటి ఆధునిక నిర్మాణాలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ మండలం కుంట్లూరులో వెలసిన ఒక ఇల్లు. రమేష్ అనే వ్యక్తి కేవలం 8 గజాల స్థలంలో రూ. 8 లక్షల ఖర్చుతో రెండంతస్తుల ఇంటిని నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అద్దె భారం నుంచి విముక్తి పొందాలనే బలమైన కోరికతో, మేస్త్రి అయిన తన తండ్రి పర్యవేక్షణలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

సమోసా ఆకారంలో

ఒక్క అంగుళం స్థలాన్ని కూడా వృథా చేయకుండా ఈ ఇంటిని సమోసా ఆకృతిలో నిర్మించడం విశేషం. ముందు భాగంలో 11 అడుగుల వెడల్పు, వెనుక వైపు కేవలం ఒక అడుగు వెడల్పుతో దూరానికి కేవలం ఒక గోడలా కనిపించే ఈ భవనం, దగ్గరకు వెళ్తేనే ఇల్లని తెలుస్తుంది. స్థలం చిన్నదైనా నిర్మాణ నాణ్యతలో రాజీ పడకుండా నాలుగు పటిష్టమైన పిల్లర్లతో భవిష్యత్తులో మరో రెండు అంతస్తులు వేసేలా ప్లాన్ చేశారు. గోల్డ్‌మాక్స్ సొసైటీ నుంచి రూ.6 లక్షల రుణం పొందడంతో పాటు ఇంట్లోనే ప్రత్యేకంగా బోర్వెల్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

మూడేళ్ల క్రితం గజానికి రూ.20 వేల చొప్పున, రోడ్డు పోటు స్థలం కావడంతో రిజిస్ట్రేషన్‌తో కలిపి రూ. 2.10 లక్షలతో ఈ చిన్న స్థలాన్ని కొనుగోలు చేశారు. ఎలాంటి సెంటిమెంట్లను పట్టించుకోకుండా తీసుకున్న ఆ నిర్ణయమే నేడు ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం ధర రూ. 45 వేలకు పైగా పలుకుతోంది. ప్రస్తుతం కింద అంతస్తును ఒక ఆఫీస్‌కు, పై అంతస్తును నివాసానికి ఒక్కోదానికి రూ.2 వేల చొప్పున అద్దెకు ఇచ్చారు. మొత్తం 90 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో నిర్మించిన ఈ ఇల్లు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. నగరాల్లో స్థలాల కొరత, అధిక ధరలతో సొంతింటిని దూరం చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి మైక్రో హోమ్స్ సరికొత్త మార్గాన్ని చూపుతున్నాయి. మూస పద్ధతులకు స్వస్తి పలికి, చిన్నపాటి స్థలాన్ని కూడా తెలివిగా సద్వినియోగం చేసుకుంటే అద్దె బాధల నుంచి బయటపడవచ్చని ఈ నిర్మాణం రుజువు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *