తాజావార్తలు

మహిళలకు బంపర్ గుడ్‌న్యూస్.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు! ఇంటర్ పాస్ అయితే చాలు

మహిళలకు బంపర్ గుడ్‌న్యూస్.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు! ఇంటర్ పాస్ అయితే చాలు


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద ఏకంగా 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమశాఖ ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా, మహబూబ్‌నగర్‌లోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేశారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే తరహాలో వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

ఏ జోన్‌లో ఏన్ని పోస్టులు ఉన్నాయంటే..

అయితే ఈసారి అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్‌ విద్యార్హతను సర్కార్‌ తప్పనిసరి చేసింది. అలాగే ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనుంది. ఈ మేరకు వరుస అంగన్‌వాడీ పోస్టులకు సంబంధించిన వరుస నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నం.4, మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నం.6ను తాజాగా జారీ చేసింది. ఇక జోన్‌ ప్రకారంగా చూస్తే మల్టీజోన్‌ 1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్‌ 2 పరిధిలో 15,197 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1247 టీచర్లు, 5145 సహాయకులు కలిపి 6,392 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇంటర్వ్యూ, మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక

నిజానికి అంగన్‌వాడీ పోస్టులు భర్తీ ప్రక్రియ ఏడాదిన్నర క్రితమే మొదలుకావల్సింది. నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీసు నిబంధనలు, తదితర అంశాలపై అధ్యయనం చేసి నియామక విధానాన్ని ఖరారు చేయాలని భావించిన సర్కార్‌.. ఇటీవల వీటిపై స్పష్టత ఇచ్చింది. అంగన్‌వాడీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పట్టణాలు లేదా గ్రామాల్లో సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలి. గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు. అలాగే ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు మాత్రమే అర్హులు. అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులను ఆయా జిల్లా కలెక్టర్‌ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి



టీచర్‌, అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకోవచ్చని నిబంధనల్లో పేర్కొంది. ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *