అందరూ.. ఇళ్లల్లో ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలు పెంచుకోవాలని ఆశపడుతుంటారు.. కానీ, ఏం పెంచుకోవాలో తెలియక ఆలోచనలో పడుతారు.. అయితే.. తక్కువ నిర్వహణతో ఎక్కువ పూలు కావాలి అనుకుంటున్న వారు.. అద్భుతమైన సువాసన కోసం సన్నజాజి పూల మొక్కను పెంచుకోవచ్చు.. సన్నజాజి మల్లె పందిరి మొక్క.. ఇల్లంతా అల్లుకుపోతుంది.. సన్నజాజి పూలను జాస్మిన్ లేదా నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. సాయంత్రం వేళల్లో వికసించి, మంచి సువాసనను వెదజల్లే ఈ మొక్క సంవత్సరం మొత్తం పూలు పూస్తుంది. సన్నజాజి మొక్క నిండుగా, ఆరోగ్యంగా పెరిగి పుష్కలంగా పూలు పూయాలంటే కొన్ని సంరక్షణ పద్ధతులు పాటించాలి.
మొదటగా, సన్నజాజి మొక్కకు పూర్తి సూర్యరశ్మి చాలా అవసరం. మొక్కను ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశంలో, ఉదాహరణకు టెర్రస్ మీద లేదా నేలలో ఉంచడం వల్ల పూల ఉత్పత్తి పెరుగుతుంది. మొక్క తరచుగా పూలు పూయడానికి సాఫ్ట్ ప్రూనింగ్ కీలకం. ఒకసారి పూత అయిపోగానే, పూలు పూసిన రెమ్మలను తుంచేయాలి (డెడ్ హెడ్డింగ్). దీనివల్ల మొక్క తన శక్తిని కొత్త చిగుర్లు, మొగ్గలు రావడానికి కేంద్రీకరించి, బుషీగా పెరుగుతుంది. ప్రతి పూత ముందు మొక్కను శుభ్రం చేసుకోవడం ద్వారా సంవత్సరం మొత్తం పూలు వస్తాయి. ఏడాదికి రెండుసార్లు హార్డ్ ప్రూనింగ్ చేయాలి. ఫిబ్రవరిలో ఒకసారి (కొత్త ఎదుగుదల ప్రారంభానికి ముందు), జూలై లేదా ఆగస్టులో (వర్షాకాలంలో) మరొకసారి కొమ్మలను కత్తిరించాలి. ఇది మొక్క ఆకారాన్ని సరిచేసి, ఎండిపోయిన కొమ్మలను తొలగిస్తుంది.
సేంద్రీయ ఎరువులు అందించడం వల్ల సన్నజాజి మొక్క బాగా పెరుగుతుంది. రసాయనాలు లేకుండా కేవలం సేంద్రీయ ఎరువులను ఉపయోగించవచ్చు. ఎరువులు వేసే ముందు 15 రోజులకు ఒకసారి మట్టిని లూస్ చేసి, ఎండిన ఆకులను తొలగించాలి. పొటాషియం అధికంగా ఉండే ఉల్లిపాయ తొక్కలు, అరటిపండు తొక్కలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి. కాల్షియం కోసం గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించాలి. ఇది కొమ్మలను బలంగా పెంచుతుంది. NPK – సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండే ఆవచెక్క పిండి (మస్టర్డ్ కేక్ పౌడర్) లేదా ఆవాల పొడిని రెండు చెంచాలు వేయాలి. వేపపిండి (నీమ్ పౌడర్) కూడా రెండు చెంచాలు వేయడం వల్ల తెగుళ్ల నివారణకు తోడ్పడుతుంది. కంపోస్ట్, ముఖ్యంగా ఆవుపేడ కంపోస్ట్ 300 గ్రాముల వరకు నెలకు ఒకసారి అందించాలి. ఇది కొత్త కొమ్మలు తొందరగా రావడానికి సహాయపడుతుంది.
నీటికి బదులు బియ్యం కడిగిన నీళ్లు లేదా పప్పులు కడిగిన నీళ్లు మొక్కకు పోషకాలను అందిస్తాయి. రైస్ వాటర్‌లో ఉండే గంజి, స్టార్చ్ వల్ల ఆకులు సహజంగా మెరిసి, శక్తివంతమైన రంగులో కనిపిస్తాయి. ఈ సేంద్రీయ ఎరువులను ప్రతి 15 రోజులకు ఒకసారి అందించాలి. కంపోస్ట్ మాత్రం నెలకు ఒకసారి సరిపోతుంది.
వర్షాకాలంలో సన్నజాజి మొక్కలకు గొంగళి పురుగులు లేదా క్యాటర్పిల్లర్స్ ఎక్కువగా వస్తాయి. ఇవి ఆకులను తినేసి మొక్కను పాడుచేస్తాయి. వీటిని నివారించడానికి ఎగ్జోడస్ అనే కీటకనాశినిని ఉపయోగించవచ్చు. 1 లీటరు నీటికి 1 మి.లీ ఎగ్జోడస్ కలిపి, మొక్క మొత్తం పిచికారీ చేయాలి. దీనితో గొంగళి పురుగులు ఒక్క రోజులోనే మాయమవుతాయి. పక్క మొక్కలకు కూడా వ్యాపించకుండా వాటిపై కూడా పిచికారీ చేయాలి.
సన్నజాజి ఒక క్రీపర్ ప్లాంట్, కాబట్టి దీనిని పందిరి మీద కూడా పాకించుకోవచ్చు. గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించే వారికి ఇది చాలా సులభంగా పెంచుకోదగిన, తక్కువ సంరక్షణ అవసరమైన మొక్క. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ సన్నజాజి మొక్క ఏడాది పొడవునా సువాసనభరితమైన పూలతో నిండిపోతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
