తాజావార్తలు

Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!

Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!


Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత మైదానంలో ఒక అరుదైన, అత్యంత హృద్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించి, 97 పరుగులతో అజేయంగా నిలిచిన కేరళ కుర్రాడు సంజు శాంసన్, కేవలం బ్యాట్‌తోనే కాదు.. తన సంస్కారంతో కోట్లాది మంది భారతీయుల మనసు గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే సంజు మైదానంలో మోకాళ్ల మీద నిలబడి హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేయడం చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. దీంతో సంజూ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

సంజు శాంసన్ కేరళలోని ఒక సంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ, అతడు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడని గతంలోనే చాలా సందర్భాల్లో నిరూపించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో విజయం సాధించగానే, మొదట శిలువ వేసుకుని, ఆ తర్వాత రెండు చేతులు జోడించి, ఆపై దోసిలి పట్టి భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సిద్ధాంతానికి సంజు శాంసన్ ఒక సజీవ సాక్ష్యంగా నిలిచాడు. మతాల కంటే మనుషులు, మానవత్వం ముఖ్యమని చాటిచెప్పిన ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సంజును ఆకాశానికెత్తుతున్నారు. కేరళ అంటే ద్వేషం కాదు.. ప్రేమ, మత సామరస్యం అని సంజు నిరూపించాడు అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కేరళ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. సంజు శాంసన్ ప్రవర్తన ద్వారా కేరళ అసలైన సంస్కృతిని ప్రపంచానికి చూపించాడని అభిమానులు సంబరపడుతున్నారు. వివాదాలకు అతీతంగా, కేవలం ఒక భారతీయుడిగా సంజు చేసిన ఈ పని అందరికీ ఆదర్శంగా నిలిచింది.

సంజు శాంసన్ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. టాలెంట్ ఉన్నా జట్టులో చోటు దక్కక ఎన్నో ఏళ్లు వెయిట్ చేశాడు. కానీ ఏ రోజూ నిరాశ చెందకుండా భగవంతుడిపై నమ్మకంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ మెగా టోర్నీలో భారత్‌ను సెమీఫైనల్ చేర్చడమే కాకుండా, తన ప్రార్థనల ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేశాడు. ఈ దృశ్యం చూశాక, సంజు కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు.. ఒక గొప్ప మానవతావాది అని అందరూ కొనియాడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *