తాజావార్తలు

PAK vs SL : గెలిచినా గండమే..క్షణక్షణానికి పాకిస్థాన్ సెమీస్ లెక్కలు చూస్తుంటే బుర్ర వేడెక్కాల్సిందే

PAK vs SL : గెలిచినా గండమే..క్షణక్షణానికి పాకిస్థాన్ సెమీస్ లెక్కలు చూస్తుంటే బుర్ర వేడెక్కాల్సిందే


PAK vs SL : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. శనివారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగబోయే 50వ మ్యాచ్ పాక్ పాలిట జీవన్మరణ సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో కేవలం గెలిస్తే సరిపోదు, సెమీఫైనల్‌కు వెళ్లాలంటే అసాధ్యమైన రన్ రేట్ సమీకరణాలను అధిగమించాల్సి ఉంటుంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా, రెండో స్థానం కోసం న్యూజిలాండ్ (+1.390 NRR) తో పాకిస్థాన్ (-0.461 NRR) పోటీ పడుతోంది. కివీస్‌ను వెనక్కి నెట్టాలంటే లంకపై పాక్ ఒక భారీ మిరాకిల్ చేయాల్సిందే.

లెక్కల ప్రకారం చూస్తే.. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే, ఇంకా కఠినమైన సవాల్ ఎదురవుతుంది. ఉదాహరణకు లంక 150 పరుగులు చేస్తే, పాక్ ఆ లక్ష్యాన్ని కేవలం 12.4 ఓవర్లలోనే పూర్తి చేయాలి. ఒకవేళ లంక 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇస్తే, దానిని 13.5 ఓవర్లలోనే కొట్టేయాలి. అంటే ప్రతి ఓవర్లో సగటున 14 పరుగుల రేటుతో బ్యాటింగ్ చేయాలి. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇది పాక్ జట్టుకు కొండను తలకిందులు చేసినంత పని.

పాకిస్థాన్ గత ఐదు మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే వారి బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో పాక్ ఒక్కసారి కూడా ఓవర్ కి 10 పరుగుల సగటును అందుకోలేదు. నెదర్లాండ్స్ వంటి చిన్న జట్టుపై 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పాక్ 19.3 ఓవర్లు తీసుకుంది (సగటు 7.5). నమీబియాపై 199 పరుగులు చేసినప్పటికీ సగటు 9.95 దగ్గరే ఆగిపోయింది. భారత్‌పై అయితే కేవలం 6.3 సగటుతో 114 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి నెమ్మదైన బ్యాటింగ్ తీరుతో, శ్రీలంక బౌలర్లను ఎదుర్కొని 13 ఓవర్లలోనే మ్యాచ్ ముగించడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

శ్రీలంక జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ, తమ సొంత గడ్డపై చివరి మ్యాచ్‌ను గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. పల్లెకెలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే బాబర్ ఆజం సేనకు చుక్కలు కనిపించడం ఖాయం. ఒకవేళ పాక్ బ్యాటర్లు విశ్వరూపం చూపి, అద్భుతం సృష్టిస్తే తప్ప సెమీస్ ఆశలు సజీవంగా ఉండవు. మొత్తానికి పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే కేవలం ప్రతిభే కాదు, అదృష్టం కూడా కొండంత ఉండాలి. శనివారం రాత్రి జరిగే ఈ పోరులో పాక్ గర్జిస్తుందో లేక నిరాశతో ఇంటి బాట పడుతుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *