తాజావార్తలు

Samatha Kumbh 2026: సాకేత రాముని సేవలో మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు

Samatha Kumbh 2026: సాకేత రాముని సేవలో మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు


ప్రతీరోజూ సుప్రభాత సేవతో మొదలయ్యే కార్యక్రమాల్లో.. అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, శాత్తుముఱై, తీర్థప్రసాద గోష్టి, బలిహరణ నిత్యం ఉంటాయి. మూడవ రోజు ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మాఘమాస పూర్ణిమ సందర్భంగా భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రవచనం చేశారు. ఈ పూర్ణిమ అత్యంత పవిత్రమైనది, విశేష ప్రభావం కలిగినదని స్వామి తెలిపారు.

గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు. తిరువీధి యాత్రలో గరుడారూఢుడై వేంచేసిన స్వామి అలుపు తీరడం కోసం ఏకాంతంగా జరిపే ఈ తిరుమంజన సేవని భక్తులందరూ సేవించుకున్నారు.  తర్వాత శ్రీరామ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరిగింది. చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో భక్తులంతా ఉత్సాహంగా శ్రీరాముని పూజలో పాల్గొన్నారు.

సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు జరిగిన చంద్ర వాహన సేవ ఆధ్యాత్మిక వెలుగులను రెట్టింపు చేసింది. భగవద్రామానుజులు సాకేతరామయ్యకు సవినయంగా స్వాగతం పలికారు. చంద్రవాహన సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19 నుంచి 36 వరకు వివిధ దివ్యదేశాధిపతులకు గరుడ వాహన సేవను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *