తెలంగాణలో కొత్త పించన్‌దారులకు గుడ్ న్యూస్. కొత్తగా పించన్లు మంజూరై నగదు కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నగదు ఎప్పుడు అందుతాయనే దానిపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తేదీన పించన్ డబ్బులు అందించనుంది. ఈ నెల నుంచి ప్రతీ నెలా చేయత పించన్లను అందించనుంది. గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ స్వయంగా నగదు విడుదల చేయనున్నారు. లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో ఇవి నేరుగా పడనున్నాయి. రేవంత్ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇదే వేదికపైనుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రేవంత్ చేపట్టనున్నారు. ఒకే రోజు రెండు కీలక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది.
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 4.72 లక్షల మందికి కొత్తగా పించన్లను మంజూరు చేసింది. వీరందరి బ్యాంక్ అకౌంట్లలో రేపు నగదు జమ కానున్నాయి. గతంలో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొద్ది నెలల నుంచి వీటిని నేరుగా పించన్దారుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తున్నారు. కొత్తగా 10 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నిజమైన లబ్దిదారులను గుర్తించారు. 360 డిగ్రీస్‌లో విచారణ చేపట్టిన అనంతరం 4.72 లక్షల మంది అర్హత సాధించినట్లు గుర్తించారు. వీరందరికీ ఇప్పటికే మంజూరు పత్రాలు కూడా అందించారు. నవంబర్ 26న అచ్చంపేట సభలో సీఎం రేవంత్ బటన్ నొక్కి డబ్బులు రిలీజ్ చేయనున్నారు. రేవంత్ విడుదల చేయగానే అందరి అకౌంట్లలో పడేలా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. చేయూత పథకం ద్వారా ప్రభుత్వం రూ.2 వేల పింఛన్ అందిస్తోంది.
అలాగే అచ్చంపేట సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా రేవంత్ ప్రారంభించనున్నారు. నవంబర్ 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు ఇందిరమ్మ జీవిత బీమా పథకం కూడా ప్రారంభించాల్సి ఉండటంతో.. చీరల పథకం వాయిదా వేశారు. రేపు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. కోటి మంది మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే మండల కేంద్రాలకు చీరలు చేరుకున్నాయి. ప్రత్యేక కేంద్రాల ద్వారా వీటిని మహిళలకు అందించనున్నారు. మహిళలు తమ ఆధార్ కార్డును తీసుకెళ్లి వీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతీ గ్రామంలో రేషన్ షాపుల వద్ద వీటిని అందించనున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి వీటిని అందిస్తోంది.
