కమలనాథులు కదనభేరీకి రెడీ అయ్యారు. తెలంగాణలో పొలిటికల్ ఫైట్‌కు సై అంటున్నారు. హైదరాబాద్ వేదికగా మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్ నగరానికి రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించనుంది. MJ మార్కెట్ దగ్గర బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ యాత్రకు లోక్‌తంత్ర బచావో.. అరాచకత్వ హటావో అని బీజేపీ పేరు పెట్టింది. మహా పాదయాత్రకు ఏకంగా లక్ష మంది జనాన్ని తరలించాలన్నది రాష్ట్ర నాయకత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. గ్రేటర్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 20 వేల మందితో భారీగా జనాన్ని సమీకరించేలా ప్లాన్ చేశారు. కార్యకర్తలే కాకుండా మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు, జెన్ జీని యాత్రలో భాగస్వామ్యం చేయాలని చూస్తోంది.
పాదయాత్ర ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సర్ ప్రక్రియపై తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ నిరసనకు దిగుతున్న కాంగ్రెస్‌కు కౌంటర్‌గా దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అమిత్ షా విమర్శలకు దిగే అవకాశం ఉంది. అమిత్ షా పాదయాత్ర బీజేపీకి బూస్ట్ ఇస్తుందా ? కాంగ్రెస్‌కు ఎలాంటి రాజకీయ సవాల్ విసురుతుంది ? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి కొత్త సమీకరణాలకు తెరలేపుతుందన్నది చూడాలి.
