సాధారణంగా ఆవు ఒక ఈతలో ఒక దూడకు జన్మనివ్వడం చూస్తుంటాం. కొన్నిసార్లు కవల దూడలు పుట్టడం కూడా జరుగుతుంది. కానీ, ఒకే ఆవు ఒకేసారి మూడు ఆడ దూడలకు జన్మనివ్వడం అరుదైన విషయమే. అందులోనూ మూడు దూడలూ, తల్లి ఆవు ఆరోగ్యంగా ఉండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. విరుదాచలం సమీపంలోని కచ్చిరాయనత్తం గ్రామానికి చెందిన మురుగన్ భార్య మహేశ్వరి (45) ఐదు ఆవులను పెంచుతున్నారు. వీటిలో నిండు గర్భంతో ఉన్న ఓ ఆవు అక్టోబర్ 26న వరుసగా మూడు ఆడ దూడలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి ఆవుతో పాటు మూడు దూడలూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గ్రామంలో తెలియడంతో దూడలను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు.
మూడు దూడలు పుట్టడం అత్యంత అరుదు..
ఆవుల్లో సాధారణంగా ఒకే దూడ పుడుతుంది. రెండు దూడలు పుట్టడం కాస్త అరుదు కాగా, ఒకేసారి మూడు దూడలు జన్మించడం అత్యంత అరుదైన ఘటన. ఆవుల్లో మూడు పిండాలు ఏర్పడటం, అవి పూర్తికాలం వరకు అభివృద్ధి చెందడం, పుట్టిన తర్వాత దూడలు ఆరోగ్యంగా ఉండటం పాడి రైతులను ఆశ్యర్యపరుస్తోంది. ఒకేసారి మూడు దూడలు పుట్టినప్పుడు వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. గర్భాశయంలో స్థలం, పోషకాలు, ఆక్సిజన్ కోసం పోటీ పెరగడంతో కొన్ని దూడలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. పుట్టిన వెంటనే తగినంత ముర్రుపాలు అందకపోతే రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మూడు దూడలూ ఆరోగ్యంగా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
తల్లి ఆవుతో పాటు దూడలకు తగిన పోషకాహారం, ముఖ్యంగా పుట్టిన తొలి గంటల్లో ముర్రుపాలు అందించడం, అవసరమైన పశువైద్య సంరక్షణ కల్పించడం ఎంతో ముఖ్యం. మొత్తానికి, ఒకే ఈతలో మూడు ఆడ దూడలకు జన్మనిచ్చిన ఈ ఆవు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అరుదైన ఈ ఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మూడు దూడలూ ఆరోగ్యంగా ఉండటం మహేశ్వరి కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తోంది.
