వారణాసి, అక్టోబర్ 26: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భారత వైమానిక దళం (IAF) నిర్వహించిన ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో అద్భుతంగా సాగింది. ఆదివారం (అక్టోబర్ 25, 2026) నమో ఘాట్ వద్ద గంగా నది మీదుగా యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై వైమానిక దళ విన్యాసాలను వీక్షించారు. గంటకు పైగా సాగిన ఈ ప్రదర్శనలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తమ సామర్థ్యాన్ని చాటిచెప్పాయి. రఫేల్, సుఖోయ్ యుద్ధ విమానాల విన్యాసాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రము ఖులకు కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ, స్వదేశీ తేజస్, ఎల్సీహెచ్ ప్రచండ్ వంటి యుద్ధ విమానాలు ఈ ఎయిర్ షోలో పాల్గొన్నాయి. రఫేల్, మిరాజ్ 2000, మిగ్-29, జాగ్వార్ విమానాలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లు కూడా తమ విన్యాసాలతో ప్రేక్షకులను అలరించాయి. ఈ ప్రదర్శన ద్వారా భారత వైమానిక దళం సాంకేతిక సామర్థ్యం, కార్యాచరణ నైపుణ్యాలు ప్రతిబింబించాయి. ఈ ఎయిర్ షోలో ‘కాశీ ఫార్మేషన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూడు కిరణ్ విమానాలు ‘V’ ఆకారంలో ప్రయాణిస్తూ త్రివర్ణ పతాక రంగులను ఆవిష్కరించాయి. ఈ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. మరోవైపు, ‘ఓంకార్ ఫార్మేషన్’లో భాగంగా ఎంఐ-17 హెలికాప్టర్లు జాతీయ పతాకాన్ని మోసుకుంటూ గగనతలంలో విహరించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో వారణాసిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీస్ లైన్స్ నుంచి నమో ఘాట్ వరకు ఆయన ప్రయాణించే మార్గంలో బీజేపీ కార్యకర్తలు, స్థానికులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. సంప్రదాయ సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని తన వాహనం ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ‘హర హర మహాదేవ్’, ‘జై శ్రీరామ్’ నినాదాలు మార్మోగాయి. ఈ ఎయిర్ షో వారణాసి ప్రజలకు గర్వకారణమని కార్యక్రమానికి హాజరైన పలువురు అభిప్రాయపడ్డారు. గంగా నది తీరంలోని ఆధ్యాత్మిక వాతావరణంలో యుద్ధ విమానాల విన్యాసాలను ప్రత్యక్షంగా చూడటం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఈ తరహా ప్రదర్శనలు యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు భారత వైమానిక దళంలో చేరాలనే ఆసక్తిని కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
వారణాసిలో గార్మెంట్ తయారీ యూనిట్ ప్రారంభం
ఎయిర్ షోకు ముందు ప్రధాని మోదీ వారణాసిలోని మిర్జామురాద్ ప్రాంతంలో అరవింద్ లిమిటెడ్‌కు చెందిన వస్త్ర తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు భారత వస్త్ర, దుస్తుల తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని సుమారు 300 మంది మహిళలతో మాట్లాడారు. కొత్త తయారీ కేంద్రం ద్వారా ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని అధికారులు వెల్లడించారు. వారణాసిలో తయారైన దుస్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించేందుకు ఈ యూనిట్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
వారణాసి పర్యటనలోని విశేషాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఎయిర్ షోను ప్రశంసిస్తూ “వారణాసి ఎయిర్ షో.. అద్భుతం!” అని పేర్కొన్నారు. అరవింద్ లిమిటెడ్ వస్త్ర తయారీ కేంద్రం మహిళా సాధికారతకు ఊతమివ్వడం ఈ యూనిట్‌లోని ముఖ్యమైన అంశాల్లో ఒకటని తెలిపారు. ఒకే పర్యటనలో భారత వైమానిక దళ సత్తా, వారణాసి సాంస్కృతిక వైభవం, పారిశ్రామిక అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి.
