తేనె అనేది తేనెటీగలు కక్కుకున్న వృథా పదార్థం కాదనేది శాస్త్రీయ సత్యం. తేనెటీగలకు ప్రత్యేకంగా హనీ స్టమక్ అనే ప్రత్యేక నిల్వ సంచి ఉంటుంది. ఇవి పూల మకరందాన్ని నేరుగా జీర్ణించుకోకుండా ఈ ప్రత్యేక సంచిలో భద్రపరుస్తాయి. తేనెటీగలు ఈ మకరందాన్ని తమ ఎంజైమ్లతో కలిపి, రెక్కల గాలితో తేమను తగ్గించి సువాసనగల తేనెను తయారు చేస్తాయి. అందువల్ల తేనె ఎప్పుడూ పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారమే.
తేనెటీగలకు రెండు కడుపులు ఉంటాయా?
అవును, తేనెటీగల శరీర నిర్మాణంలో మకరందాన్ని నిల్వ చేయడానికి, ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ప్రత్యేకంగా వేర్వేరు వ్యవస్థలు ఉంటాయి. తేనెటీగలు పూల నుండి సేకరించిన మకరందాన్ని తమ సాధారణ జీర్ణ కడుపులోకి పంపకుండా, ప్రత్యేకంగా ఉండే హనీ స్టమక్ లేదా హనీ క్రాప్ అనే సంచిలో నిల్వ చేసుకుంటాయి. ఈ ప్రత్యేక సంచి కేవలం మకరందాన్ని భద్రపరచడానికి, రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
వామిట్, రీగర్జిటేషన్ మధ్య తేడా:
వామిట్అంటే కడుపులో పూర్తిగా జీర్ణమైన ఆహారం బలవంతంగా నోటి ద్వారా బయటికి రావటం. ఇది అనారోగ్యం లేదా విషపూరిత పదార్థాల వల్ల జరుగుతుంది. కానీ తేనెటీగల విషయంలో అలా జరగదు. మకరందాన్ని హనీ స్టమక్ నుండి బయటికి తీయడాన్ని రీగర్జిటేషన్ అంటారు. ఇక్కడ ఎలాంటి జీర్ణక్రియ ప్రక్రియ జరగదు కాబట్టి, దీనిని వామిట్తో పోల్చలేము.
ఇవి కూడా చదవండి
తేనె ఎలా తయారవుతుంది?
తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి తమ హనీ స్టమక్లో నిల్వ చేసుకొని గూటికి చేరుకుంటాయి. గూటికి చేరుకున్నాక, ఆ మకరందాన్ని ఇతర వర్కర్ బీస్కు నోటి ద్వారా బదిలీ చేస్తాయి. ఈ ప్రక్రియలో తేనెటీగల సాల్వా లోని ప్రత్యేక ఎంజైమ్లు మకరందంలోని సంక్లిష్ట చక్కెరలను సులభమైన చక్కెరలుగా మారుస్తాయి. తేనెటీగలు తమ రెక్కలతో వేగంగా గాలిని వీస్తూ, మకరందంలో ఉన్న అదనపు నీటిని ఆవిరిగా మారుస్తాయి. నీటి శాతం తగ్గి చిక్కగా మారిన తర్వాత, దానిని తేనె గూటి గదులలో భద్రపరుస్తాయి.
తేనె అనేది తేనెటీగలు తమ కడుపులో జీర్ణం చేసుకొని కక్కిన పదార్థం కాదు. ఇది కేవలం పూల మకరందాన్ని సురక్షితంగా నిల్వ చేసి, వాటి శరీరంలోని ఎంజైమ్లతో శుద్ధి చేసి తయారు చేసిన ఒక అద్భుతమైన సహజ ఆహార పదార్థం. కాబట్టి, ఎలాంటి అపోహలు లేకుండా తేనెను నిరభ్యంతరంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
