తాజావార్తలు

Vizag: మొత్తానికి నైటీ గ్యాంగ్ గుట్టు వీడింది.. ఒక్క కేసు విచారణలో బయటపడ్డ 28 చోరీల చిట్టా


ఊరు మారుస్తూ.. ఇళ్లను టార్గెట్‌ చేస్తూ.. అందినకాడికి దోచేస్తున్నారు. ఊరు ఏదైనా.. వీళ్ల టార్గెట్‌ మాత్రం తాళం వేసిన ఇళ్లే. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా చొరబడి.. బంగారం, వెండి, నగదు ఊడ్చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలతో హడలెత్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ కేటుగాళ్లు వేసిన స్కెచ్‌ మామూలుగా లేదు. రాత్రిపూట మహిళల నైటీలు ధరించి.. ఆడవాళ్లలా తిరుగుతూ చోరీలకు పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో మహిళల్లా కనిపించిన వాళ్లే.. అసలు దొంగలని తేలడంతో పోలీసులే కంగుతిన్నారు.

అనకాపల్లి హైవే బస్టాప్‌ దగ్గర పోలీసులకు కీలక ఆధారం

 అనకాపల్లి జిల్లాలో వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. మునగపాక, నక్కపల్లి, రాంబిల్లి, పరవాడ, ఎలమంచిలి, సబ్బవరం ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోయారు. మునగపాక పరిధిలోని వెంకటాపురంలో జరిగిన చోరీ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. దొంగల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అనకాపల్లి హైవే బస్టాప్‌ దగ్గర పోలీసులకు కీలక బ్రేక్‌ దొరికింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగులు తెరిచి చూస్తే.. బంగారం, వెండి ఆభరణాలు, నగదు కనిపించాయి. అక్కడ మొదలైన విచారణలో ఒక్కొక్కటిగా దొంగతనాల గుట్టు వీడింది.

నైటీ గ్యాంగ్‌ చోరీలకు కీలక సూత్రధారి చేపల ఆనంద్‌

ఈ నైటీ గ్యాంగ్‌కు కీలక సూత్రధారి చేపల ఆనంద్‌. విశాఖ జిల్లా గంగవరం ప్రాంతానికి చెందిన ఆనంద్‌కు చిత్రపు అభిషేక్‌, నిమ్మాడ దిలీప్‌ తోడయ్యారు. ముగ్గురిదీ పాత క్రైమ్‌ ట్రాక్‌ రికార్డే. చోరీలు చేయడం.. పోలీసులకు చిక్కడం.. జైలుకు వెళ్లడం.. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు దిగడం. ఇదే వీళ్ల క్రైమ్‌ సైకిల్‌. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను టార్గెట్‌ చేస్తూ అందినకాడికి దోచుకునేవారు. అయితే పాత పద్ధతిలో చోరీలకు వెళ్తే మళ్లీ దొరికిపోతామనుకున్నారో ఏమో.. ఈసారి ఏకంగా గెటప్‌ మార్చేశారు. పోలీసులను బురిడీ కొట్టించేందుకు లేడీ అవతారం ఎత్తారు. నైటీలు ధరించి అర్ధరాత్రి చోరీలకు వెళ్లడం మొదలుపెట్టారు. కానీ ఎంత పక్కాగా ప్లాన్‌ వేసినా.. చివరికి పోలీసుల వలలో చిక్కిపోయారు.

ముగ్గురి అరెస్ట్‌తో బయటపడ్డ 28 కేసుల చిట్టా

ఒక్క చోరీ కేసులో ముగ్గురిని పట్టుకుంటే.. ఏకంగా 28 కేసుల చిట్టా బయటపడింది. మునగపాక నుంచి సబ్బవరం వరకు ఏడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలతో ఈ ముఠాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 442 గ్రాములకు పైగా బంగారం, ఆరు కిలోలకు పైగా వెండి, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇన్నాళ్లూ పోలీసులకు సవాల్‌ విసిరిన నైటీ గ్యాంగ్‌ ఆటకట్టింది. ఆడవాళ్ల వేషంలో తిరిగితే ఎవరూ అనుమానించరనుకున్నారు. కానీ అదే వేషం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో పోలీసులకు కీలక ఆధారం దొరికింది. మొత్తానికి పోలీసుల కళ్లుగప్పేందుకు నైటీలు వేసుకున్న దొంగల ప్లాన్‌ బెడిసికొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *