తాజావార్తలు

కుక్కతో పోరాడి.. తల్లి, తమ్ముడిని కాపాడిన బాలుడికి కార్నెగీ మెడల్‌!


Alex Munroe 13 Year Old Canadian Punched A German Shepherd To Free His Mother And Brother Wins Carnegie Medal

కెనడాకు చెందిన 13 ఏళ్ల బాలుడు అలెక్స్ మున్రో తన వయసుకి మించి సాహసం చేసాడు. తన తల్లి, ఎనిమిదేళ్ల తమ్ముడిపై ఓ జర్మన్ షెపర్డ్ దాడి చేయడంతో ప్రాణాలకు తెగించి పోరాడాడు. పిడికిళ్లతో కుక్క తలపై పదే పదే కొట్టి,  తల్లిని తమ్ముడిని విడిపించాడు. ఈ సాహసానికి గుర్తింపుగా ఉత్తర అమెరికా అత్యున్నత పురస్కారం కార్నెగీ మెడల్ ఫర్ హీరోయిజం వరించింది.

మంచులో ఆడుకుంటుండగా దాడి చేసిన కుక్క

ఈ ఘటన 2023 మార్చి 6న కెనడాలోని నోవా స్కోటియా ప్రాంతం, విండ్సర్ జంక్షన్‌లో జరిగింది. ఎనిమిదేళ్ల విల్ మున్రో తన పదేళ్ల సోదరుడితో కలిసి ఇంటికి సమీపంలో ఓ వీధిలో మంచులో ఆడుకుంటున్నాడు. అంతలో ఓ జర్మన్ షెపర్డ్  అక్కడికి వచ్చింది.
అది ఒక్కసారిగా విల్‌పై దాడి చేసింది. అతడి చేతిని నోటితో గట్టిగా పట్టుకుని, నేలపై అటూ ఇటూ లాగింది. దీంతో విల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణాన్ని చూసిన అతని సోదరుడు వెంటనే ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పాడు.

కొడుకును కాపాడేందుకు పరిగెత్తిన తల్లి

కొడుకు ప్రమాదంలో ఉన్నాడని తెలియగానే విల్ తల్లి ట్రిషా మున్రో ఇంటి నుంచి బయటకు పరుగెత్తింది. ఆమె ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి విల్ నేలపై పడి ఉన్నాడు. కుక్క అతడి చేతిని వదలకుండా పట్టుకుని ఉంది. తన కొడుకును కాపాడేందుకు ట్రిషా కుక్కపై కూర్చుని, విల్‌ను విడిచిపెట్టేలా చేయడానికి దాని నోటిలో చేతులు పెట్టి ప్రయత్నించింది. అయినప్పటికీ కుక్క అతడిని వదల్లేదు.

తల్లి, తమ్ముడిని రక్షించేందుకు కుక్కతో పోరాటం

అదే సమయంలో అలెక్స్ మున్రో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తన తల్లి కుక్కను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండటం, తమ్ముడు దాని దాడిలో చిక్కుకోవడం చూసి వెంటనే రంగంలోకి దిగాడు. కుక్క తలపై తన పిడికిళ్లతో బలంగా కొట్టాడు. దీంతో కుక్క విల్‌ను వదిలిపెట్టింది. అయితే ప్రమాదం అంతటితో ముగియలేదు. కుక్క అతని తల్లి కుడి చేతి కింది భాగాన్ని నోటకరిచింది. తల్లిని విడిపించేందుకు అలెక్స్ మళ్లీ కుక్క తలపై కొట్టాడు. ఈసారి పిడికిలితో పాటు చేతి కింది భాగంతోనూ దాడి చేశాడు. దీంతో కుక్క ఆమె కుడి చేతిని వదిలి ఎడమ చేతిని పట్టుకుంది. అలెక్స్ వెనక్కి తగ్గకుండా మరోసారి కుక్కపై దాడి చేశాడు. చివరకు అది ట్రిషా ఎడమ చేతిని కూడా వదిలిపెట్టింది. ఇంతలో కుక్క యజమాని అక్కడికి చేరుకుని దానిని తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు.

ఆసుపత్రికి తల్లి, తమ్ముడు.. అలెక్స్‌ చేతికి గాయం

ఈ ఘటనలో విల్ తల, చేతికి గాయాలయ్యాయి. అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కుక్క కరిచిన గాయాలకు వైద్యులు చికిత్స అందించారు. ట్రిషాకు కూడా రెండు చేతులు, కుడి చేతిపై కుక్క కాటు గాయాలయ్యాయి. ఆమెకు అదే ఆసుపత్రిలో చికిత్స అందించారు. కుక్కను తన పిడికిళ్లతో పదే పదే కొట్టిన అలెక్స్ చేతులకు గాయమైంది కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు.

రెండేళ్ల తర్వాత అలెక్స్‌కు అరుదైన గౌరవం

ఉత్తర అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ కార్నెగీ హీరో ఫండ్ కమిషన్.. అలెక్స్‌కు కార్నెగీ మెడల్ ఫర్ హీరోయిజం ప్రకటించింది. తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన వారికి ఈ పతకాన్ని అందిస్తారు. 1904లో పారిశ్రామికవేత్త, దాత ఆండ్రూ కార్నెగీ ఈ నిధిని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 10,510 మందికి సంస్థ పతకాలను ఇచ్చింది. ఇప్పటివరకు గ్రాంట్లు, స్కాలర్‌షిప్‌లు, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం, ఇతర సహాయాల రూపంలో 45 మిలియన్ డాలర్లకు పైగా అందించింది. చిన్న వయసులోనే తల్లి, తమ్ముడి ప్రాణాలు కాపాడటం కోసం అసామాన్య సాహసాన్ని, తెగువను ప్రదర్శించిన అలెక్స్ మున్రో.. తన సాహసోపేత చర్యతో కార్నెగీ హీరోగా గుర్తింపు పొందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *