తాజావార్తలు

‘ఇప్పటివరకు నీకెంతమంది అమ్మాయిలు పడ్డారు?’.. UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న!


‘ఇప్పటివరకు నీకెంతమంది అమ్మాయిలు పడ్డారు?’.. UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న!

సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు పర్సనాలిటీ టెస్ట్ కూడా కీలకమే. అయితే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంటే కేవలం పుస్తకాల్లో చదివిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మాత్రమే కాదు. అభ్యర్థి ఆలోచనా విధానం, వ్యక్తిత్వం, సమయస్ఫూర్తిని కూడా పరీక్షిస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది సివిల్స్ అభ్యర్థి యడవల్లి అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ అనుభవం. 624వ ర్యాంకు సాధించిన అక్షయ్ కుమార్ తన ఇంటర్వ్యూలో ఎదురైన ఆసక్తికరమైన ప్రశ్నలు, బోర్డు సభ్యులతో జరిగిన సంభాషణ, చివరికి వచ్చిన మార్కుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

యడవల్లి అక్షయ్ కుమార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ మార్చి 23న జరిగింది. ఈ తేదీకి భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. అప్పటికి భగత్ సింగ్ వయస్సు 23 సంవత్సరాలు. ఇంటర్వ్యూ సమయంలో తన వయస్సు కూడా 23 సంవత్సరాలే కావడంతో, తనకు భగత్ సింగ్ గురించి ప్రశ్నలు ఎదురవుతాయని అక్షయ్ భావించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్‌కు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లిన తనకు మధ్య వయస్సులో ఒక పోలిక ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, ఇద్దరి మార్గాలు వేర్వేరని, భగత్ సింగ్ విప్లవ మార్గాన్ని ఎంచుకోగా, తాను అహింసా మార్గాన్ని విశ్వసిస్తానని వివరించారు.

తొలి ప్రశ్నతో ఆశ్చర్యం.. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాని పరిస్థితి!

రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అజిత్ బోన్సలే అధ్యక్షతన జరిగిన ఇంటర్వ్యూ సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు సాగింది. బోర్డు సభ్యులు తనను ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించారని, మొత్తం ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగిందని అక్షయ్ తెలిపారు. అయితే ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఎదురైన తొలి ప్రశ్న ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఇప్పటివరకు నీకెంతమంది అమ్మాయిలు పడ్డారు?’ అని బోర్డు సభ్యులు అడిగినట్లు అక్షయ్ వెల్లడించారు. ఆ ప్రశ్న విన్న వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నవ్వుతూ, ఒక్కరు కూడా లేరని చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని తాను అస్సలు ఊహించలేదన్నారు. తన వ్యక్తిగత విషయాల గురించి ఇతరుల పేర్లు ప్రస్తావించడం ఇష్టం లేదని, అందుకే ఆ అంశాన్ని అక్కడితో ముగించానని వివరించారు. ఆ ప్రశ్నతో ప్రారంభమైన ఇంటర్వ్యూ, ఆ తర్వాత సాధారణ సంభాషణలా కొనసాగింది. తనకు అది ప్రశ్నలు-సమాధానాల రూపంలో జరిగే సంప్రదాయ ఇంటర్వ్యూలా అనిపించలేదని అక్షయ్ చెప్పారు.

ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్‌ను పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఆయన వరంగల్ ప్రాంతానికి చెందినవారు కావడంతో నక్సలిజంపై ప్రశ్నలతో చర్చ ప్రారంభమైంది. ఆ సిద్ధాంతంపై తనకు ఆసక్తి ఉందని, అందువల్ల ఆ అంశంపై ప్రశ్నలు రావడం సంతోషంగా అనిపించిందని అక్షయ్ తెలిపారు. ఆ తర్వాత అమెరికాలో జాతి వివక్ష, హర్ష్ మందర్-రామచంద్ర గుహ మధ్య జరిగిన చర్చ వంటి అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వన్యప్రాణులపై తనకున్న ఆసక్తి కారణంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు, నార్తర్న్ వైట్ రైనో గురించి కూడా అడిగారు. భారతదేశంపై బ్రిటిష్ వలస పాలన చూపిన సానుకూల, ప్రతికూల ప్రభావాలు, ఉడాన్ పథకం వంటి అంశాలపైనా ప్రశ్నలు వచ్చాయి. అలాగే, అక్షయ్ స్వస్థలమైన హనుమకొండ పేరుకు సంబంధించిన చరిత్రను కూడా బోర్డు సభ్యులు అడిగారు. అక్షయ్ కుమార్ ఆప్షనల్ సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావడంతో, చైనా, శ్రీలంక దేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలపైనా చర్చ జరిగింది. ఇలా వివిధ అంశాలపై ప్రశ్నలు ఎదురైనా, తాను బాగా సిద్ధమైన కొన్ని అంశాల నుంచి ప్రశ్నలు రాలేదని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇంటర్వ్యూ ముగింపు సమయంలో అజిత్ బోన్సలే మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘ఈరోజు మీ ప్రణాళికలు ఏమిటి?’ అని ప్రశ్నించారు. దానికి అక్షయ్, తాను మొదటిసారి ఢిల్లీకి వచ్చానని, ఇంటర్వ్యూ తర్వాత ఏం చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని సమాధానమిచ్చారు. దీంతో బోన్సలే ఢిల్లీలో సందర్శించదగిన ప్రదేశాల గురించి వివరించారు. కుతుబ్ మినార్, కన్నాట్ ప్లేస్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చని సూచించడంతో పాటు, వాటికి సంబంధించిన వివరాలను కూడా చెప్పారు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఇంటర్వ్యూ మొత్తం ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా సాగిందని అక్షయ్ తెలిపారు. బోర్డు సభ్యులు తనను ఒత్తిడికి గురిచేయకుండా, సహజంగా మాట్లాడేలా చేశారని చెప్పారు.

ఇంటర్వ్యూ బాగా జరగలేదనుకున్నా.. మార్కులు మాత్రం అదిరిపోయాయి!

ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన అక్షయ్ కుమార్ తన ప్రదర్శనపై కొంత నిరాశకు గురయ్యారు. తాను ఎంతో కష్టపడి చదివిన అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రాలేదని, ఎక్కువ సమయం సాధారణ సంభాషణకే కేటాయించినట్లు అనిపించిందని చెప్పారు. ‘ఈ చర్చతో నన్ను ఎలా అంచనా వేస్తారు? నాకు ఎన్ని మార్కులు వస్తాయి?’ అని ఆలోచించినట్లు గుర్తుచేసుకున్నారు. ఇంటర్వ్యూలో గరిష్ఠంగా 120 నుంచి 130 మార్కులు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత తనకు వచ్చిన మార్కులు చూసి ఆశ్చర్యపోయానని అక్షయ్ చెప్పారు. తన ఇంటర్వ్యూ మార్కుల గురించి ప్రస్తావిస్తూ, సుమారు 180 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ స్కోరు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తుది ఫలితాల్లో 624వ ర్యాంకు సాధించడంలో ఇది కీలకంగా నిలిచిందని వివరించారు. తన ఇంటర్వ్యూలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించిన బోన్సలే బోర్డు సభ్యులకు అక్షయ్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అజిత్ బోన్సలే సార్‌కు ధన్యవాదాలు చెప్పాలని ఉందని పేర్కొన్నారు.

యూపీఎస్సీ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమకు తెలిసిన ప్రశ్నలే వస్తాయని ముందుగానే నిర్ణయించుకోకూడదని అక్షయ్ కుమార్ అనుభవం సూచిస్తోంది. ఇంటర్వ్యూలో వ్యక్తిగత ప్రశ్నల నుంచి సమకాలీన అంశాల వరకు ఏదైనా ఎదురుకావచ్చు. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండటం, ప్రశ్నను అర్థం చేసుకుని సమాధానం చెప్పడం, తెలియని విషయాలపై అనవసరంగా ఊహించి మాట్లాడకపోవడం ముఖ్యం. అలాగే ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే అది బాగా జరిగిందా లేదా అనే విషయంపై తొందరగా నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. అభ్యర్థి ఊహించిన ప్రశ్నలు రాకపోయినా, బోర్డుతో సహజంగా సంభాషించడం ద్వారా మంచి ప్రదర్శన చేయవచ్చు. ఐపీఎస్‌ అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ అనుభవం చెప్పే సందేశం ఒక్కటే.. సివిల్స్ ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు ముందుగానే సిద్ధమైన సమాధానం ఉండాల్సిన అవసరం లేదు. ప్రశాంతత, సమయస్ఫూర్తి, స్పష్టమైన ఆలోచన కూడా విజయానికి దోహదపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *