తాజావార్తలు

Suddala Ashok Teja: నేను పాట మాత్రమే రాశా.. కానీ దానికి ఆ హీరో ప్రాణం పోశాడు.. సుద్దాల అశోక్ తేజ..


ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని సంచలనాత్మక గీతం కొమురం భీముడో రచన వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పాట సృష్టికి ఎస్.ఎస్. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, ఎం.ఎం. కీరవాణి వంటి దిగ్గజాలతో జరిగిన సంభాషణలు, రాజమౌళి దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. రాజమౌళి గారిని రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు గారిని కలిపితే తయారైనటువంటి అత్యంత మేధోవంతమైన, సున్నిత హృదయంతో కూడినటువంటి క్యారెక్టర్ అని అశోక్ తేజ అన్నారు. పాటను కొమురం భీముడు తన గురించి తానే చెప్పుకునే విధంగా రాయాలని సూచన వచ్చినప్పుడు, స్వీయ డబ్బాగా అనిపించకుండా జాగ్రత్త పడటం ప్రధాన సవాలని ఆయన తెలిపారు. బలిదానం ఉంటది అనే భావంతో తాను రాసినట్లు వివరించారు. ఈ ప్రమాదకరమైన, కత్తి అంచు మీద నడక లాంటి రచనా విధానాన్ని రాజమౌళి ప్రోత్సహించడం ఆయన గొప్పతనమని అశోక్ తేజ అన్నారు.

పాటలో తెలంగాణ ప్రాంతీయ మాండలికాన్ని, చారిత్రక సందర్భాన్ని మిళితం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అశోక్ తేజ వివరించారు. భూతల్లి చనుబాలు తాగనట్టేరో, ఇవ్వాళ చస్తే రేపటికి రెండు ఎందుకురా భయపడతావ్? వంటి పదబంధాలు, అరణం అనే తెలంగాణ సంప్రదాయాన్ని పాటలో పొందుపరిచారు. ఈ పదాలు కోస్తా ప్రజలకు అర్థమవుతాయా అనే సందేహాలు తలెత్తినా, నేను దృశ్యం ద్వారా అర్థం చేపిస్తా. నువ్వు అక్కడ పుట్టి పెరిగిన కొమురం భీముడి వాయిస్ ఏదైతే అదే రాయ్ అంటూ రాజమౌళి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అశోక్ తేజ వెల్లడించారు. కాలువై పారే నీ గుండె నెత్తురు, నేలమ్మ నుదుట బొట్టైతుంది చూడు వంటి అద్భుతమైన పంక్తులు ఈ స్వేచ్ఛా మైదానం నుంచే పుట్టాయని ఆయన వివరించారు.

కీరవాణి గారితో తన అనుబంధం గురించి చెబుతూ, ఆయనకు అలవాటుగా నువ్వు రాసేస్తావు కదా, నువ్వు పాడతావు కదా అని ప్రోత్సహిస్తారని అశోక్ తేజ పేర్కొన్నారు. మూడు రకాల ట్యూన్‌లు రాసి ఇవ్వగా, మూడో రకాన్ని ఎంపిక చేసుకున్నారని తెలిపారు. కొమురం భీముడో పాట విషాదం, ఆత్మవిశ్వాసం, ఆశయం పట్ల అంకితభావాల సమ్మేళనమని, ప్రతి అక్షరాన్ని ఈ భావాలతోనే రాసినట్లు వివరించారు. ఈ పాట కేవలం తన సృష్టి కాదని, సినిమా అనేది అనేక మేధావుల సమిష్టి కృషేనని అశోక్ తేజ చెప్పారు. రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం, రామ్ చరణ్ కొడతాడని కూడా చెప్పకుండా బీమ్ పాటను రాసేలా ఆయన ఇచ్చిన స్ఫూర్తి, జూనియర్ ఎన్టీఆర్ నటన, కాల భైరవ గానం అన్నీ కలిసి ఈ పాటకు అనూహ్యమైన విజయాన్ని అందించాయని ఆయన ప్రశంసించారు. జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో పాటకు ఎవరెస్ట్ స్థాయిని తీసుకువచ్చారని, రాజమౌళి తార స్థాయికి తీసుకెళ్లారని, కీరవాణి అద్భుత స్వర స్థాయిని అందించారని పేర్కొన్నారు. ఈ పాటకు కాల భైరవకు జాతీయ అవార్డు లభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

జూనియర్ ఎన్టీఆర్..

Suddala Ashok Teja, Jr Ntr

Suddala Ashok Teja, Jr Ntr

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *