సాధారణంగా ఆ షాపుకు ప్రజలు పాత వస్తువులు, దుస్తులు, పుస్తకాలు విరాళంగా ఇస్తుంటారు. అయితే ఈసారి వచ్చిన కరెన్సీ నోట్లలో ఎంతో అరుదైనవి ఉన్నాయి. తొలుత వాటి విలువ గురించి షాప్ సిబ్బందికి పెద్దగా అవగాహన లేదు. షాప్‌లోని సిబ్బంది ఆ నోట్లను పరిశీలించినా వాటి ప్రత్యేకతను గుర్తించలేకపోయారు. దీంతో వాటిని మరింత లోతుగా పరిశీలించేందుకు లీడ్స్‌లోని తమ ఈబే బృందానికి పంపించారు. అక్కడ నోట్ల విలువ గురించి తెలుసుకున్న తర్వాత సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
అరుదైన కరెన్సీ నోట్లలో ఏమున్నాయంటే?
ఈ సేకరణలో ప్రత్యేక నమూనాలుగా రూపొందించిన నోట్లు, ప్రయోగాత్మక నోట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని కలెక్టర్లకు ఎంతో విలువైనవిగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా యువరాణిగా ఉన్న సమయంలో క్వీన్ ఎలిజబెత్-2 చిత్రంతో ముద్రించిన అరుదైన, చలామణిలోకి రాని నోటు ఈ సేకరణలో ఉంది. మలయా, బ్రిటిష్ కరెన్సీ బోర్డు జారీ చేసిన ఒక నోటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే 1947లో రూపొందించిన అరుదైన ఇరాక్ 10 దినార్ల రంగుల నమూనా నోటు కూడా ఈ సేకరణలో ఉంది. 1961లో రూపొందించిన సౌదీ అరేబియాకు చెందిన 100 రియాల్స్ నమూనా నోటు సైతం ఇందులో భాగంగా ఉంది. ఇలాంటి నోట్లను సాధారణంగా కరెన్సీ సేకరణపై ఆసక్తి ఉన్నవారు ఎంతో విలువైనవిగా భావిస్తారు. ముఖ్యంగా అరుదైనవి, పరిమిత సంఖ్యలో రూపొందించినవి, చలామణిలోకి రాని నోట్లు వేలంలో ఎక్కువ ధర పలికే అవకాశం ఉంటుంది.
వేలంలో రూ. కోటికి పైగా ధర
ఈ అరుదైన నోట్లను నూనాన్స్ అనే ప్రత్యేక వేలం సంస్థ అక్టోబర్ 14, బుధవారం జరిగిన వేలంలో వీటిని విక్రయించింది. మొత్తం నోట్ల సేకరణకు 85,860 పౌండ్లు వచ్చాయి. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. కోటికి పైగా విలువ పలికాయి. ఈ విక్రయంతో బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు భారీగా నిధులు సమకూరాయి. అంతేకాదు, వేలం నిర్వహించిన నూనాన్స్ సంస్థ తన విక్రయ కమిషన్‌ను కూడా తీసుకోలేదు. దీంతో వచ్చిన మొత్తంలో మరింత భాగం స్వచ్ఛంద సంస్థకు ఉపయోగపడనుంది.
విరాళం ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు
అరుదైన నోట్లకు భారీ విలువ రావడంపై బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు విరాళంగా ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీ కలెక్టర్లు ఈ వేలంపై ఆసక్తి చూపారు. స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చే ఉద్దేశంతో జరిగిన విక్రయం కావడంతో కొన్ని నోట్లు సాధారణంగా పలికే ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తానికి, ఓ వ్యక్తి నిశ్శబ్దంగా చేసిన విరాళం.. అరుదైన కరెన్సీ నోట్ల విలువతో స్వచ్ఛంద సంస్థకు భారీ ఆదాయం సమకూరింది. గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన, పరిశోధన, రోగులకు సహాయం వంటి కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగించనున్నారు.
