తాజావార్తలు

బంగ్లాదేశ్ జెన్-జెడ్ ఉద్యమమే స్ఫూర్తి: AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా కీలక వ్యాఖ్యలు


ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో యువత చేపడుతున్న ఆందోళనలకు, నిరసనలకు బంగ్లాదేశ్ విద్యార్థి నేతృత్వంలోని జెన్-జెడ్ ఉద్యమమే స్ఫూర్తి అని బహిరంగంగా పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాను కూడా బంగ్లాదేశ్ జెన్-జెడ్ ఉద్యమాన్ని చూసి.. ప్రేరణ పొందానని తెలిపారు.  బంగ్లాదేశ్ సోషలిస్ట్ స్టూడెంట్ ఫ్రంట్ ఆరవ జాతీయ మహాసభను పురస్కరించుకుని విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉద్భవిస్తున్న ‘జెన్-జెడ్’ (Gen Z) తరపు ఉద్యోగాలపై బంగ్లాదేశ్ పోరాటాల ప్రభావం ఎంతో బలంగా ఉందని ఆమె అభివర్ణించారు. బంగ్లాదేశ్ విద్యార్థి కార్యకర్తలను అభినందిస్తూ, ప్రజాస్వామ్య హక్కుల కోసం యువత సాగిస్తున్న సామూహిక పోరాటాలు సరిహద్దులు దాటి ఇతర దేశాల యువతకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

“ఆరవ జాతీయ సదస్సు సందర్భంగా సోషలిస్ట్ స్టూడెంట్స్ ఫ్రంట్‌కు విప్లవాత్మక శుభాకాంక్షలు. ఈ దేశంలో మనం ప్రతిచోటా చూస్తున్న జెన్-జెడ్ ఉద్యమం మొదట బంగ్లాదేశ్‌లోనే ప్రారంభమైందని మాకు తెలుసు. మాకు మార్గం చూపినందుకు మీకు అభినందనలు” అని ఆమె అన్నారు. రెండు పొరుగు దేశాల్లోని విద్యార్థుల పోరాటాల మధ్య సారూప్యతను చూపుతూ, భారతదేశంలోని యువత కూడా ప్రజాస్వామ్య, ఓటు హక్కులను పరిరక్షించే ఉద్యమాలలో పాల్గొంటూ వాటికి నాయకత్వం వహిస్తున్నారని నేహా అన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కు వ్యతిరేకంగా.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా కీలకంగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *