చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్కు చెందిన వాంగ్ యింగ్ కి పక్షులను ఫొటోలు తీయడమంటే ఎంతో మక్కువ. ఇప్పటివరకు 1,200కు పైగా పక్షి జాతులను కెమెరాలో బంధించారు. అయితే, 2013లో ఉద్యోగ విరమణకు సిద్ధమవుతున్న సమయంలో ఆమెకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ వాంగ్ తనకు ఎంతో ఇష్టమైన పని పూర్తి చేయాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి పెంగ్విన్లను ఫొటోలు తీయాలని కలలు కన్నారు. క్యాన్సర్ నిర్ధారణతో ఆ కలను వాయిదా వేయడం ఆమెకు ఇష్టం లేదు. ‘ తనకు మరణం సంభవిస్తే.. హాస్పిటల్ బెడ్ పై కాదు.. ఎక్కడో దూరంగా చనిపోవాలి..’ అనుకున్నారు వాంగ్. అంటార్కిటికా యాత్రకు దాదాపు 1.5 లక్షల చైనా యువాన్లు ఖర్చు చేశారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.18 లక్షలు. పొదుపు మొత్తం సరిపోకపోవడంతో తల్లి సాయం చేశారు. వాంగ్ నెల రోజుల పాటు అంటార్కిటికాలో గడిపారు.
మైనస్ 10 డిగ్రీల చలిలో పెంగ్విన్ల కోసం ఎదురుచూపులు!
చేపలు పట్టి తిరిగి వచ్చిన తల్లి పెంగ్విన్ తన పిల్లకు ఆహారం అందించే దృశ్యాన్ని కెమెరాలో బంధించాలని, వాంగ్ గడ్డకట్టే చలిలో ఓపికగా ఎదురుచూశారు. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినా, బలమైన చలి గాలులు వీచినా, మంచు కురిసినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇతర పర్యాటకులు అక్కడి నుంచి వెళ్లిపోయినా.. వాంగ్ మాత్రం తన కెమెరాతో ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు ఆమె ఎదురుచూపులు ఫలించాయి. చేపలు పట్టి తిరిగొచ్చిన తల్లి పెంగ్విన్ తన పిల్లకు ఆహారం అందించే అద్భుతమైన క్షణాన్ని ఫొటో తీశారు. ‘ఆ విలువైన క్షణాన్ని నా కెమెరాలో బంధించాను. ఎంతో సంతోషంగా అనిపించింది. పెంగ్విన్లు కలిసి నడుస్తూ, తమ నివాసం కోసం వెతుక్కుంటూ వెళ్లడం చూసి నా మనసు చలించింది’ అని వాంగ్ చెప్పారు.
తిరిగొచ్చాక పరీక్షలు.. తగ్గిన కణితి!
అంటార్కిటికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాంగ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అంతకుముందు పరీక్షలతో పోలిస్తే ఆమె థైరాయిడ్ కణితి పరిమాణం తగ్గినట్లు వైద్యులు గుర్తించడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు చెప్పడంతో వాంగ్కు జీవితంపై కొత్త ఆశ చిగురించింది. తనకు ఇష్టమైన పనులు చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలనే నిర్ణయం మరింత బలపడింది.
30కి పైగా దేశాల్లో పర్యటనలు.. ఇంకా ఎన్నో కలలు!
వాంగ్ ప్రస్తుతం తన సమయాన్ని వన్యప్రాణుల ఫొటోగ్రఫీకి కేటాయిస్తున్నారు. తన పెన్షన్లో కొంత మొత్తాన్ని ప్రయాణాలకు, అత్యాధునిక కెమెరా పరికరాల కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు 30కి పైగా దేశాల్లో పర్యటించారు. క్యాన్సర్ నిర్ధారణతో ఎంతో కాలంగా కోరుకున్న ప్రయాణాలను ఆస్వాదిస్తున్న వాంగ్ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీవితంలో కష్టాలు ఎదురైనా నచ్చిన పనులు కొనసాగించడం, ఆశాభావంతో మెలగడం ముఖ్యమనీ ఆమె అనుభవం మనకు గుర్తుచేస్తోంది.
