తాజావార్తలు

Ranabaali Pre Release Event: రణబాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుంది.. విజయ్ దేవరకొండ..


రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయ్ దేవరకొండ ప్రసంగంతో ఓ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పండగ వాతావరణంలో అక్టోబర్ 16న రణబాలి విడుదలవుతుందని, తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “వస్తుంది సింగనమల బొబ్బిలి రణబాలి. రా నీ యెక్క!” అంటూ సినిమాపై తనకున్న ఆత్మవిశ్వాసాన్ని చాటారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ విజన్‌ను విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ప్రశంసించారు. ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాల తర్వాత ఒక పెద్ద, రూరల్ మాస్ పీరియడ్ ఫిలిం చేయాలని రాహుల్ కలలు కన్నారని వివరించారు. తన ఊరికి వెళ్లి, అక్కడ కథలు, జాతరలు, బుర్రకథలు, వీరుల చరిత్రలు తెలుసుకుంటున్నప్పుడు రాహుల్‌కు ఒక పెద్ద కాన్వాస్ లభించిందని చెప్పారు. అయితే, ఆ కాన్వాస్‌కు మన చరిత్రలో దాగివున్న ఒక అంకం గురించి తెలిసినప్పుడు, ఒక పర్పస్ లభించిందని, అది రణబాలి రూపంలోకి వచ్చిందని తెలిపారు. కేవలం పీరియడ్ యాక్షన్ ఫిలిం లేదా చారిత్రక సినిమా మాత్రమే కాకుండా, ఈ రెండు అంశాలను కలిపి ఒక బ్యూటిఫుల్ విధానంలో చెప్పడంలోనే రణబాలి ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. రాహుల్ కెరీర్ కోసం కాకుండా, ముఖ్యమైన కథలు చెప్పడానికి సినిమాలు చేస్తారని విజయ్ కొనియాడారు.

విజయ్ దేవరకొండ తన ప్రసంగంలో ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని అందించారు. జీవితంలో చక్రంలా కొన్ని ప్యాటర్న్‌లు పునరావృతమవుతాయని చెబుతూ, సూపర్ ఎల్ నినో గురించి ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడారని గుర్తుచేస్తూ, కరువు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. 150 సంవత్సరాల క్రితం సంభవించిన సూపర్ ఎల్ నినో మద్రాస్ కరువుకు ప్రధాన కారణమని, బ్రిటిషర్లు చేసిన ఘోరాల వల్ల 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మళ్ళీ ఆ ఎల్ నినో పునరావృతమవుతున్న నేపథ్యంలో, మనం జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. నీటిని, విద్యుత్‌ను, ఆహారాన్ని పొదుపుగా వాడాలని, ఏదీ వృథా చేయవద్దని కోరారు. రాబోయే ఒక సంవత్సరం పాటు మనం ఈ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

తన కెరీర్ ప్రయాణాన్ని కూడా విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నారు. ట్యాక్సీవాలా సమయంలో ఎదురైన సవాళ్లు, నోటా చిత్రం సరిగా ఆడకపోవడం, ఆ తర్వాత తను పడ్డ బాధ, “ఐ విల్ బీ బ్యాక్” అంటూ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. “When I said I will be back, be bloody sure I will be back” అంటూ తన పట్టుదలను మరోసారి చాటారు. రణబాలితో దర్శకుడు రాహుల్ మళ్ళీ తనకు ఆ వేదికను కల్పిస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతపురంలో రణబాలి విజయోత్సవ సభలో మళ్ళీ ఈ మాటలను గుర్తుచేస్తానని అన్నారు. నమ్మకం, చేసే పని పట్ల పూర్తి అంకితభావం ఈ రెండే మన చేతిలో ఉంటాయని, మిగిలినవి కలిసి రావాలని తెలిపారు.

తన చిత్ర బృందానికి విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, వై. రవిశంకర్) తెలుగు సినిమాకు చేస్తున్న సేవను కొనియాడారు. సినిమాటోగ్రాఫర్ జిష్ణు భట్టాచార్య, సంగీత దర్శకులు అజయ్-అతుల్ అందించిన ఏందయ్యా స్వామి పాట బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. రష్మిక మందన్న నటన, నటిగా ఆమె ఎదుగుదలను ప్రశంసించారు. చిత్రంలోని ఇతర నటీనటులు తమ పాత్రల్లో జీవించేశారని, ఇది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *