తాజావార్తలు

ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. కేంద్రం కీలక ఆదేశాలు..


దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల సెగ.. భద్రతా ఆంక్షలు.. పోలీసుల భారీ మోహరింపు.. వెరసి ఉత్కంఠ నెలకొంది. సీఈసీకి వ్యతిరేకంగా ఇవాళ జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది సీజేపీ. అయితే సీజేపీ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిరసనలకు విధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గత ఆందోళనల్లో 200 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని, క్రిమినల్‌ నేపథ్యం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారని ఆరోపించారు.

పోలీసులు అనుమతి నిరాకరించినా నిరసన నిర్వహించి తీరుతామని సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. అరెస్టులు, నిర్బంధాలకు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లోకి తీసుకొచ్చారు. వేలాది మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందితో పాటు.. భారీ సంఖ్యలో పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు.. సోషల్‌ మీడియా పోస్టులపైనా నిఘా పెట్టారు. మరోవైపు ఆకతాయిలు, అరాచక శక్తుల కదలికలపై దృష్టి పెట్టాలంటూ ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల CSలకు లేఖ రాసింది కేంద్రహోంశాఖ. ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

భారీ బందోబస్తు..

ఢిల్లీ అంతటా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.. దాదాపు 25వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో మెట్రో రైళ్లను కూడా మూసివేశారు. కన్నాట్ ప్లేస్‌ను జంతర్ మంతర్‌తో కలిపే దాదాపు 500 మీటర్ల పొడవైన సంసద్ మార్గ్‌పై.. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *