తాజావార్తలు

రైలు కుదుపుతో ప్రయాణికుడి మృతి చెందితే ఎవరి బాధ్యత? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!


న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రైలులో అకస్మాత్తుగా వచ్చిన కుదుపు కారణంగా బెర్త్‌ నుంచి కిందపడి ప్రయాణికుడు మరణించిన ఘటనలో రైల్వే బాధ్యత నుంచి తప్పించుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

ఈ ఘటన 2015లో జరిగింది. సంజీవ్ కుమార్ తన తండ్రి శ్యామ్ సింగ్‌తో కలిసి ఇటావా నుంచి ఆగ్రా కంటోన్మెంట్‌కు సెకండ్ క్లాస్ టికెట్‌పై రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు ఆగ్రా చేరుకునే సమయంలో ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో పై బెర్త్‌లో ఉన్న సంజీవ్ కుమార్ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. రైల్వే వైద్యుడు పరీక్షించిన అనంతరం అతను మరణించినట్లు ప్రకటించారు.

పోస్ట్‌మార్టం నివేదికతో కేసు మలుపు

సంజీవ్ కుటుంబ సభ్యులు రైలులో జరిగిన ప్రమాదమే అతని మరణానికి కారణమని పేర్కొంటూ నష్టపరిహారం కోసం రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అయితే 2022 సెప్టెంబర్‌లో ట్రిబ్యునల్ వారి పిటిషన్‌ను కొట్టివేసింది. పోస్ట్‌మార్టం నివేదికలో గుండెపోటు కారణంగా మరణించినట్లు పేర్కొనడంతో, దీనిని రైల్వే ప్రమాదంగా పరిగణించలేమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ మనోజ్ కుమార్ ఆరోరా.. సంజీవ్‌కు గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిరూపించే వైద్య ఆధారాలు లేవని పేర్కొన్నారు.

రైల్వే బాధ్యత తప్పించుకోలేదన్న హైకోర్టు

పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్న వైద్య కారణాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని రైల్వే తన బాధ్యత నుంచి తప్పించుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసిన కోర్టు.. కుటుంబానికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన రెండు నెలల్లోగా పరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *