తాజావార్తలు

అమెరికాలో భయం నీడన వినాయక చవితి..ఇళ్లలోనే జరుపుకోవాలని మెసేజ్ లు!


అపార్ట్‌మెంట్లు, కాలనీలు లేదా బహిరంగ ప్రదేశాలలో ఎవరూ సామూహికంగా వేడుకలు జరుపుకోవద్దని ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే,  ఇంట్లోనే పండుగ చేసుకుంటామని వారికి సున్నితంగా చెప్పాలని కోరారు. అలాగే కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రూప్ వీడియోలను సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దనీ,  రోడ్డు పక్కన చేసే సెలబ్రేషన్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదనీ,  రోడ్లపై భారీగా మండపాలు ఏర్పాటు చేయడం, ఎక్కువ మంది గుంపుగా చేరి పెద్ద శబ్దాలతో వేడుకలు నిర్వహించడం మానుకోవాలనీ, నదులు లేదా జలశయాలలో నిమజ్జనం చేయడం వంటి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆ హెచ్చరిక సందేశంలో పేర్కొన్నారు.

హెచ్చరికలకు కారణాలివే

శాంతియుతంగా పండుగ జరుపుకుని స్థానిక నిబంధనలను తప్పకుండా పాటించాలని  సందేశంలో కోరారు. ఎన్ఆర్ఐలకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా కమ్యూనిటీ ఖాతాలలో ఈ పోస్టులు ప్రస్తుతం అమెరికాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి హెచ్చరికలు రావడానికి స్పష్టమైన కారణాలున్నాయి.

 అమెరికాలో ఇటీవలి కాలంలో భారతీయులపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత (Anti-India wave) స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లిన కొంతమంది ప్రవర్తన అక్కడ వివాదాస్పదంగా మారుతోంది. కొందరు చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. కేవలం సోషల్ మీడియా కంటెంట్ కోసం పబ్లిక్ ప్లేసులలో అతిగా ప్రవర్తించడం, రోడ్లపైనా రద్దీ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు నిర్వహించడం వల్ల స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

ఉద్యోగాలు కోల్పోతున్నామనే ఆవేదనతో పాటు, టెక్సాస్, డల్లాస్ వంటి ప్రాంతాల్లో భారతీయుల ప్రాభవం పెరుగుతుండటాన్ని అక్కడి స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మాగా’ (MAGA – మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఉద్యమానికి మద్దతు తెలిపే వర్గాలు భారతీయులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతి విద్వేషానికి పాల్పడుతున్నాయి.

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భారతీయులు బహిరంగంగా వేడుకలు జరుపుకుంటే, అది స్థానిక ప్రజలకు మరింత ఆగ్రహం తెప్పించవచ్చని అక్కడి ఎన్ఆర్ఐ నేతలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీపై వ్యతిరేకత మరింత పెరగకుండా అడ్డుకోవడానికి, అందరి భద్రతను దృష్టిలో ఉంచుకునే స్థానిక కమ్యూనిటీ పెద్దలు ఈ ముందుస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కార్లోస్ టూర్సియోస్ వివాదాస్పద పోస్ట్

ఫిబ్రవరిలో టెక్సాస్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్త కార్లోస్ టూర్సియోస్, షుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ప్రతిష్టించిన 90 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తీవ్ర దుమారం రేపారు. దీనిని భారతదేశం లేదా భారతీయుల ‘ఆక్రమణ’ అంటూ అభివర్ణిస్తూ, “మూడో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన విదేశీయులు నెమ్మదిగా టెక్సాస్, అమెరికాలను ఆక్రమించుకుంటున్నారు” అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఆక్రమణను ఆపాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *