తాజావార్తలు

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం.. గంభీర్ పని అయిపోయినట్లేనా ?


Gautam Gambhir: జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పేరును అధికారికంగా ఖరారు చేశారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు జపాన్ వెళ్లే బాధ్యతలను బీసీసీఐ కట్టబెట్టింది. ఆసియా క్రీడలు 2026లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని స్పష్టమైంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అధిపతిగా ఉన్న లక్ష్మణ్ తన సహాయక బృందంతో కలిసి జపాన్ వెళ్లనున్నారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టుకు ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. ఐచి-నాగోయా వేదికగా జరిగే ఈ క్రీడల కోసం క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రతినిధుల జాబితాలో లక్ష్మణ్ పేరును ప్రతిపాదించారు.

సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లలో భారత జట్టుతో భారీ స్థాయిలో కోచింగ్ సిబ్బంది పయనిస్తుంటారు. అయితే ఆసియా గేమ్స్ నిబంధనలు విభిన్నంగా ఉండటంతో లెక్కింపు చాలా పరిమితంగా మారింది. భారత్ తరఫున మహిళల, పురుషుల జట్లకు కలిపి కేవలం 20 మంది సపోర్ట్ స్టాఫ్‌కు మాత్రమే అనుమతి దక్కింది. పరిమిత సిబ్బందితోనే ప్రణాళికలు రచించి పతకం సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు లక్ష్మణ్ బృందంపై ఉంది.

భారత జట్టుకు హెడ్ కోచ్‎గా బాధ్యతలు చేపట్టడం వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇదే మొదటిసారి కాదు. గతంలో జింబాబ్వే పర్యటనలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీ20 జట్టుకు ఆయనే హెడ్ కోచ్‌గా మార్గదర్శనం చేశారు. 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టును విజేతగా నిలిపిన ఘనత కూడా లక్ష్మణ్‌దే. ఆ అనుభవం జపాన్ పర్యటనలో జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఆసియా గేమ్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే మైదానం ఒకప్పుడు బేస్‌బాల్ క్రీడా ప్రాంగణం కావడం గమనార్హం. దానిని తాత్కాలికంగా డ్రాప్-ఇన్ పిచ్‌లు ఏర్పాటు చేసి క్రికెట్ మైదానంగా మార్చారు. అక్కడ ఆటగాళ్లకు నివాస, డ్రెస్సింగ్ రూమ్ వసతులు అంతగా బాగోలేవని సమాచారం. హోటల్ గదుల్లో ఇద్దరు క్రీడాకారులు ఉంటే కిట్ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా స్థలం చాలని పరిస్థితి నెలకొంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వాష్ రూమ్ వందల మీటర్ల దూరంలో ఉందనే కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *