గుడ్డు లోపల పాము పిండం ఎదిగే తీరు దశాబ్దాలుగా జీవశాస్త్రవేత్తలకు ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. గుడ్డు నుంచి బయటకు రావడానికి చాలా ముందే, పిండ దశలోనే పాము శరీరం ఒక జెల్లీబీన్ ఆకారంలో గుండ్రంగా చుట్టుకోవడం మొదలవుతుంది. అయితే ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పాము జాతుల్లోనూ ఈ చుట్టుకోవడం ఎల్లప్పుడూ కుడి వైపుకే జరుగుతుంది. ఎడమ వైపుకు అస్సలు తిరగదు. కండరాలే ఏర్పడని ఆ దశలో పాము శరీరాన్ని కేవలం కుడి వైపుకే తిప్పే శక్తి ఏది? ఈ సుదీర్ఘ రహస్యానికి శాస్త్రవేత్తలు ఎట్టకేలకు పరిష్కారం కనుగొన్నారు.
లాక్‌డౌన్‌లో మొదలైన పరిశోధన.. 900 పిండాల స్కానింగ్
ప్రముఖ శాస్త్రీయ పత్రిక కరెంట్ బయాలజీలో ప్రచురితమైన పరిశోధనా ప్రకారం.. కెనడియన్ మ్యూజియం ఆఫ్ నేచర్‌కు చెందిన శాస్త్రవేత్త టెట్సుటో మియాషితా, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధకురాలు అలెగ్జాండ్రా వెబర్ ఈ మిస్టరీని ఛేదించారు. 2020 లాక్‌డౌన్ సమయంలో ప్రారంభమైన వీరి పరిశోధనలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 39 జాతుల పాములు, కాళ్లు లేని సరీసృపాలకు చెందిన 900కు పైగా పిండాల మైక్రో సీటీ స్కాన్ చిత్రాలను క్షుణ్ణంగా విశ్లేషించారు. ఆశ్చర్యకరంగా పిండంలో ఇంకా ఎలాంటి కండరాలు, స్నాయువులు వృద్ధి చెందకముందే దాని శరీరం కచ్చితంగా కుడి వైపుకు తిరగడాన్ని వారు గుర్తించారు. కండరాలే లేనప్పుడు శరీరాన్ని ఎవరు తిప్పుతున్నారనే ప్రశ్నకు అత్యాధునిక స్కానింగ్ సమాధానం ఇచ్చింది.
అసలు సీక్రెట్ గుడ్డులోని పచ్చసొన, పేగు బంధంలోనే
అత్యాధునిక సీటీ స్కాన్ల ద్వారా శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన శారీరక అమరికను గుర్తించారు.
శరీరం వెలుపలే పేగులు: ప్రారంభ పిండ దశలో పాము పేగులు దాని కడుపు లోపల ఉండవు. అవి శరీరం బయట ఉంటూ, గుడ్డులోని పచ్చసొనకు నేరుగా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ప్రత్యేక బంధాన్ని పరిశోధకులు గట్ కాలమ్‌గా వెల్లడించారు.
ఎడమ వైపు పచ్చసొన.. కుడి వైపు మలుపు: గుడ్డు లోపల ఈ పచ్చసొన ఎల్లప్పుడూ పిండానికి ఎడమ వైపునే స్థిరంగా ఉంటుంది. ఒక పొడవైన దారం ఒక చివరను ఒకవైపు పట్టుకుని లాగితే మిగిలిన భాగం గుండ్రంగా మెలితిరిగినట్లే ఇక్కడా జరుగుతుంది. ఎడమవైపున స్థిరంగా ఉన్న పచ్చసొనకు అతుక్కుని ఉన్న పేగు భాగం శరీరాన్ని వ్యతిరేక దిశలో లాగుతుంది. ఫలితంగా ఎదుగుతున్న పాము శరీరం బలవంతంగా కుడి వైపుకు వంగి, మెలికలు తిరుగుతుంది.
చివర్లో మరో ట్విస్ట్
అయితే కథ ఇంతటితో అయిపోలేదు. గుడ్డు లోపల రోజులు గడిచేకొద్దీ పాము శరీరంలో కండరాలు, ఎముకలు క్రమంగా బలంగా తయారవుతాయి. ఆ దశకు చేరుకున్నాక పాము తన శరీరాన్ని సొంతంగా కదిలించే సామర్థ్యాన్ని సాధిస్తుంది. గుడ్డు పగిలి బయటకు రావడానికి కొద్దిరోజుల ముందు, దాదాపు 50 శాతం పాము పిల్లలు తమ శరీరాన్ని ఎడమ వైపునకు కూడా తిప్పుకుంటాయని శాస్త్రవేత్తలు గమనించారు.
ఏది ఏమైనప్పటికీ.. భూమిపై పాము జీవితపు తొలి మలుపు మాత్రం ఎడమ వైపునున్న పచ్చసొన ఇచ్చిన భౌతిక ఒత్తిడి వల్ల కుడి వైపు నుంచే మొదలవుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రకృతిలోని జీవ వైవిధ్యం, పిండ దశ నిర్మాణాల వెనుక ఉన్న అధునాతన భౌతిక శాస్త్రాన్ని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది.
