తాజావార్తలు

Ramana Maharshi: విగ్రహారాధనలో వివేకం ఉందా..? రమణ మహర్షి చెప్పిన సమాధానం ఇదే..


భగవంతుడికి రూపం లేదు.. అయితే నిరాకారుడైన భగవంతుడిని ఓ విగ్రహం రూపంలో ప్రతిష్ఠించి పూజించడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నకు రమణ మహర్షి ఎంతో లోతైన ఆధ్యాత్మిక దృష్టితో సమాధానం ఇచ్చారు. నిరాకారుడైన భగవంతుడిని విగ్రహంగా చేసి పూజించడం వివేకమేనా? అని ఓ భక్తుడు ప్రశ్నించగా.. ముందుగా మన స్వరూపాన్ని తెలుసుకోవాలని రమణ మహర్షి సూచించారు. ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోమడం, స్నానం చేయడం, ఉతికిన దుస్తులు ధరించడం, తలను దువ్వడం, మూడు పూటలా తిండి తినడం.. ఇవన్నీ ఎవరి విగ్రహాన్ని వారు ఆరాధించడం కాదా?’ అని ప్రశ్నించారు.

మనిషి తనను శరీరంగా భావిస్తున్నంతకాలం, నిరాకారుడైన భగవంతుడిని ఒక రూపంలో భావించి పూజించడంలో తప్పులేదని రమణ మహర్షి వివరించారు. నిద్రలో మనకు శరీర స్పృహ ఉండదు. అయినప్పటికీ మేల్కొన్న తర్వాత ‘నేను నిద్రపోయాను’ అని అంటాం. అంటే శరీరానికి అతీతమైన ‘నేను’ అనే చైతన్యం ఉందని ఆయన బోధించారు.

రమణ మహర్షి దృష్టిలో విగ్రహారాధన మనస్సును లగ్నం చేసేందుకు ఒక సాధన. భక్తి, పూజ, జపం వంటి మార్గాలు చివరకు వ్యక్తిలోని అహంకారాన్ని తగ్గించి, తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకునే దిశగా తీసుకెళ్లాలి. విగ్రహారాధనను తప్పుబట్టడం కంటే దాని అంతరార్థాన్ని గ్రహించడం ముఖ్యమని ఆయన బోధనల నుంచి అర్థమవుతుంది. ఎలాంటి పేరు, రూపం లేని పరమాత్మ అన్నింట్లో అంతర్గతంగా ఉన్న ఆత్మ అని స్వయంగా గుర్తించడమే నిజమైన వివేకం అవుతుంది. అదే అసలు సత్యం.

అద్వైత సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవిలోనూ ఒకే ఆత్మస్వరూపం ఉంది. ‘నేను’, ‘నువ్వు’ అనే భేదాలు శరీరం, మనస్సు స్థాయిలో కనిపించినప్పటికీ అంతర్లీన సత్యం ఒక్కటేనని ఈ తత్వం చెబుతుంది. రమణ మహర్షి బోధనలో ‘నేను ఎవరు?’ అనే ఆత్మ విచారణకు అందుకే ప్రత్యేక స్థానం ఉంది. అన్నింటిలోనూ ఒకే ఆత్మస్వరూపం ఉందని నిజంగా గ్రహించినప్పుడు మనుషుల మధ్య ఉన్న తారతమ్యాలు, ద్వేషాలు, భేదభావాలు క్రమంగా తొలగిపోతాయి. అదే అద్వైతం చెప్పే అంతిమ సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *