తాజావార్తలు

ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి..


నల్లగొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27), రమేష్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మగబిడ్డ కావాలన్న కుటుంబ ఆశ మరోసారి గర్భం దాల్చింది. 8 రోజుల క్రితం మమత కాన్పు కోసం ఈనెల 3న జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చింది. 4వ తేదీన రాత్రి 10:38 నిమిషాలకు వైద్యులు ఆపరేషన్‌ చేయగా, మమత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలింతల వార్డులో మమత, ఆమె వెంట సహాయకులు ఉన్నారు. వారం రోజులుగా డాక్టర్లు చెప్పిన సమయానికి బాబుకు పాలిచ్చి, మమత తిరిగి తన వార్డుకి వెళ్లిపోయేది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. కానీ ఆ ఆనందం క్రమంగా విషాదంగా మారింది.

బాలింత అయిన మమతకు ఆయాసంతో ఛాతీ దగ్గర పట్టేసినట్టుందని సిబ్బందికి చెప్పింది. అయినా డాక్టర్లు సిబ్బంది మమతను పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డ మమత అర్ధరాత్రి రెండు గంటలకు వార్డు నుంచి బయటకు వచ్చింది. తన వెంట తెచ్చుకున్న చీరతో ఆస్పత్రి ఆవరణలోని వాటర్ ట్యాంక్ స్టాండ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బెడ్‌పై మమత లేదన్న విషయం గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రి ఆవరణతో పాటు జిల్లా పరిసర ప్రాంతాల్లోనూ వెతికారు. వాటర్ ట్యాంక్ స్టాండ్ కు వేలాడుతూ మమత కనిపించింది. సమయానికి రోజు బిడ్డకు పాలిచ్చే తల్లీ లేకపోవడంతో కుమారుడు పాల కోసం ఏడవడాన్ని చూసి అక్కడున్నవారు కన్నీరు మున్నీరయ్యారు. రాత్రి విధుల్లో ఉన్న ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మమత ఆత్మహత్యకు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

నల్లగొండ జిజిహెచ్ లో జరిగిన బాలింత ఆత్మహత్యపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. మమత ఆత్మహత్య కేసులో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన ఆ పసిబిడ్డకు ఇప్పుడు తల్లి లేని లోటు మిగిలింది. కళ్లుతెరిచి ప్రపంచాన్ని పూర్తిగా చూడకముందే.. అమ్మ ప్రేమకు దూరమైంది. ఒకవైపు ఎనిమిది రోజుల మగబిడ్డ.. మరోవైపు తల్లి నీడ కోల్పోయిన ముగ్గురు చిన్నారులు. ఒక్కసారిగా ఆ కుటుంబం పరిస్థితి విషాదంగా మారింది. పండంటి బిడ్డ కోసం ఎదురుచూసిన ఆ కుటుంబానికి.. చివరకు మిగిలింది మాత్రం తీరని కన్నీటి జ్ఞాపకమే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *