తాజావార్తలు

జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం! 82 ఏళ్ల తాతకు సెల్యూట్

జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం! 82 ఏళ్ల తాతకు సెల్యూట్


మదురైకి చెందిన 82 ఏళ్ల వృద్ధుడు పి. సుబ్బయ్య అరుదైన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు మొత్తాన్ని సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళంగా ఇవ్వడంతో పాటు, మరణానంతరం తన శరీరాన్ని వైద్య విద్య, పరిశోధనలకు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. తిరుప్పరన్‌కుండ్రంలోని హార్వే నగర్‌కు చెందిన సుబ్బయ్య సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన జిల్లా ప్రజా సమస్యల పరిష్కార సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణకు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి కోసం రూ.10,000 చెక్కును అందజేశారు.

అంతటితో ఆగకుండా తన ఆస్తులను కూడా దేశ సేవకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. తన బ్యాంకు ఖాతాలో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదు, దానిపై వచ్చే వడ్డీతో పాటు, బ్యాంకు లాకర్‌లో ఉన్న మరో రూ.30 లక్షల విలువైన వస్తువులు, ఆస్తులను పతాక దినోత్సవ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని అధికారికంగా నమోదు చేస్తూ వీలునామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. తన మరణానంతరం కూడా తన శరీరం ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

తన శరీరాన్ని మరణానంతరం వైద్య విద్య, పరిశోధనల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేయాలని కోరుతూ ప్రత్యేక ప్రకటనను కూడా అధికారులకు సమర్పించారు. సొంత అవసరాల కోసం జీవితకాలం కూడబెట్టుకున్న సంపదను కూడా సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా చేయాలన్న సుబ్బయ్య నిర్ణయం పలువురిని ఆకట్టుకుంది. వృద్ధాప్యంలోనూ దేశ సేవ, వైద్య పరిశోధనలకు తన వంతు సహకారం అందించాలన్న ఆయన సంకల్పం ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *