హైదరాబాద్ మహానగర శివారులో ఈగల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా తరలిస్తున్న 237 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.18 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ–ముంబై జాతీయ రహదారి (NH-65)పై వైఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH 14 HU 3599 కలిగిన లారీ కంటైనర్‌ను ఆపి తనిఖీ చేశారు. డ్రైవర్ క్యాబిన్ పైభాగంలో ప్రత్యేకంగా దాచిన 10 గంజాయి సంచులను గుర్తించి మొత్తం 237 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాజేష్ కుమార్, అనిల్ రంగనాథ్ బిచారేలను అరెస్టు చేయడంతో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో రాజేష్ కుమార్ గతంలో ముంబైలో లారీ డ్రైవర్‌గా పనిచేసినట్లు తేలింది. ఏడునెలల క్రితం పూణేకు చెందిన డ్రగ్స్ వ్యాపారులు సురేష్ కేదారి, ధరమ్ షిండేలతో అతనికి పరిచయం ఏర్పడింది. లారీ కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజేష్‌కు వారు రూ.3 లక్షల సహాయం అందించారు. ప్రతిఫలంగా ఒడిశా నుంచి పూణేకు గంజాయి తరలించాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జూలై 7న రాజేష్‌కు రూ.1.50 లక్షలు అందించి, విజయవాడలో ఒడిశాకు చెందిన గంజాయి సరఫరాదారు పబిత్రా కుమార్ సబర్‌ను కలవాలని సూచించారు. అనంతరం వారు ఒడిశాలోని రాయగడ జిల్లా గుణ్‌పూర్‌కు వెళ్లి, అక్కడ గంజాయి అందుబాటులో లేకపోవడంతో కొద్ది రోజులు వేచి చూశారు. చివరకు విశాఖపట్నం సమీపంలో పబిత్రా కుమార్ నుంచి 237 కిలోల గంజాయిని తీసుకుని లారీ క్యాబిన్‌లో దాచినట్లు విచారణలో వెల్లడైంది.
మొదట విచారణలో నిందితులు తాము విశాఖపట్నం వరకే వెళ్లినట్లు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయితే మొబైల్ కాల్ డేటా రికార్డులు పరిశీలించగా వారు ఒడిశాలోని గుణ్‌పూర్‌కు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలతో ప్రశ్నించగా నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సురేష్ కేదారి, ధరమ్ షిండే, పబిత్రా కుమార్ సబర్ పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
