తాజావార్తలు

NEET UG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులను ఇక్కడ చెక్ చేసుకోండి..

NEET UG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులను ఇక్కడ చెక్ చేసుకోండి..


దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పేపర్ లీక్ వివాదంతో రద్దైన పరీక్షను జూన్ 21, 2026న తిరిగి నిర్వహించగా, ఇప్పుడు గడువుకంటే ముందుగానే ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

ఈ ఏడాది జరిగిన రీ-నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు. పేపర్ లీక్, పరీక్ష రద్దు, మళ్లీ పరీక్ష నిర్వహణ వంటి సవాళ్ల మధ్య కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు విజయం సాధించడం విశేషంగా నిలిచింది. దీంతో ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

ఈసారి పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ 720 మార్కులకు 715 మార్కులు సాధించి సంయుక్తంగా అఖిల భారత తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 19 మంది అభ్యర్థులు 700కిపైగా మార్కులు సాధించగా, 138 మంది 690కిపైగా, 1,492 మంది 650కిపైగా మార్కులు సాధించారు. అలాగే 10,160 మంది విద్యార్థులు 600 మార్కులకు పైగా స్కోర్ చేసి మెడికల్ సీట్ల కోసం పోటీలో నిలిచారు.

ఈసారి అమ్మాయిలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. అర్హత సాధించిన విద్యార్థుల్లో 58 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. మహిళల ఉత్తీర్ణత శాతం 56.8 కాగా, పురుషుల ఉత్తీర్ణత శాతం 55.1గా నమోదైంది. అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఎక్కువ మంది మొదటిసారి నీట్ రాసిన విద్యార్థులే ఉండటం విశేషం. 690కు పైగా స్కోర్ చేసిన 138 మందిలో 93 శాతానికి పైగా తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు.

దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 1.7 లక్షలకు పైగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, లక్షద్వీప్ నుంచి 43 మంది అర్హత సాధించారు. కేటగిరీల వారీగా చూస్తే జనరల్‌లో 2.91 లక్షలు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌లో 5.12 లక్షలు, ఎస్సీలో 1.59 లక్షలు, ఎస్టీలో 63,716 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 95,026 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షను తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిర్వహించనుండగా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్నాయి.

ఈ సందర్భంగా ఎన్‌టీఏ విద్యార్థులకు కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. సీట్లు ఇప్పిస్తామని, మార్కులు పెంచుతామని చెప్పే మోసగాళ్లను నమ్మవద్దని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే సమాచారం పొందాలని, అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వస్తే వెంటనే ఎన్‌టీఏకు ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *