తాజావార్తలు

అమ్రాబాద్ అడవుల్లో అద్భుతం.. తెలంగాణలో అడుగుపెట్టిన భారతదేశపు అతిపెద్ద రెక్కల సుందరి!

అమ్రాబాద్ అడవుల్లో అద్భుతం.. తెలంగాణలో అడుగుపెట్టిన భారతదేశపు అతిపెద్ద రెక్కల సుందరి!


అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మరోసారి జీవవైవిధ్య విశిష్టతను చాటుకుంది. దేశంలోనే అతిపెద్ద సీతాకోకచిలుకల్లో ఒకటైన సదరన్ బర్డ్ వింగ్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో దర్శనమిచ్చింది. సాధారణంగా సదరన్ బర్డ్ వింగ్ పశ్చిమ కనుమ ప్రాంతంలోనే కనిపిస్తుంటుంది. తూర్పు కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి జాతి సీతాకోకచిలుక ఇప్పుడు అమ్రాబాద్ అడవుల్లో నమోదు కావడం ఈ ప్రాంతంలోని శాస్త్రీయంగా, జీవవైవిధ్య పరిరక్షణ పరంగా అత్యంత ప్రాధాన్యను సంతరించుకుంది.

ఈ అరుదైన సీతాకోకచిలుకను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నీలేష్, వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గుర్తించి అధికారికంగా నమోదు చేశారు. ఈ నమోదుతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని జీవవైవిధ్యంపై మరిన్ని పరిశోధనలకు మార్గం సుగమం కానుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులకు, ఔషద మొక్కలకు నిలయంగా ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తాజాగా అరుదైన సీతాకోకచిలుక సదరన్ బర్డ్ వింగ్ నమోదుతో మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

సదరన్ బర్డ్ వింగ్ శ్రాస్త్రీయ నామం Troides minos. ఈ జాతి సీతాకోకచిలుక నలుపు, పసుపు రంగుల కలయికతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వీటి రెక్కల విస్తీర్ణం 140-190 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ఆడ సీతాకోకచిలుక పరిమాణంలో మరింత పెద్దగా ఉంటుంది. ఈ అరుదైన సీతాకోకచిలుక ఎత్తైన అడవులు, సతతహరిత అటవీ ప్రాంతాలు, స్వచ్ఛమైన పర్యావరణం ఉన్న ప్రాంతాల్లో జీవిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *