తాజావార్తలు

AIతో టెక్‌ ప్రపంచంలో సంచలనం.. 4 ఏళ్లలో రూ.5.5 లక్షల కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 25ఏళ్ల కుర్రాడు!

AIతో టెక్‌ ప్రపంచంలో సంచలనం.. 4 ఏళ్లలో రూ.5.5 లక్షల కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 25ఏళ్ల కుర్రాడు!


భారతీయ మూలాలున్న కుటుంబంలో పుట్టి అమెరికాలో పెరిగిన అమన్‌ సాంగర్‌ చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కోడింగ్‌ నేర్చుకున్న అమన్‌.. ప్రముఖ విద్యాసంస్థ MITలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుతున్న సమయంలోనే గూగుల్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం దక్కింది. అయితే పెద్ద సంస్థల్లో పని విధానం చాలా నెమ్మదిగా ఉండటంతో, తన ఆలోచనలకు అక్కడ స్వేచ్ఛ లేదని భావించిన అమన్‌ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు MIT చదువును కూడా మధ్యలోనే ఆపేశాడు.

స్నేహితులతో కలిసి స్టార్టప్‌

అమన్‌తో పాటు ఆసిఫ్‌, మైకెల్‌, ఆర్విడ్‌ అనే ముగ్గురు స్నేహితులు కూడా చదువుకు గుడ్‌బై చెప్పి 2022లో ‘ఎనీస్ఫియర్‌’ అనే సంస్థను ప్రారంభించారు. మొదట మెకానికల్‌ ఇంజినీర్ల కోసం ఏఐ ఆధారిత CAD టూల్స్‌ రూపొందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. మొదటి ప్రయత్నం విఫలమైనా వెనక్కి తగ్గకుండా, తమకు బాగా తెలిసిన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ రంగంపైనే దృష్టి పెట్టారు. 2023లో ‘కర్సర్‌.ఏఐ’ పేరుతో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. మొదట రూపొందించిన ఏఐ ఎడిటింగ్‌ టూల్‌ పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో మార్కెట్‌ అవసరాలను అర్థం చేసుకుంటూ, వినియోగదారుల అభిప్రాయాలను సేకరిస్తూ కొత్త ఫీచర్లను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే ‘వైబ్‌ కోడింగ్‌’ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. ఇదే కర్సర్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది.

వైబ్‌ కోడింగ్‌ అంటే ఏమిటి?

సాంప్రదాయ పద్ధతిలో ఒక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ రూపొందించాలంటే గంటల తరబడి కోడింగ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ వైబ్‌ కోడింగ్‌లో వినియోగదారు తనకు కావాల్సిన వెబ్‌సైట్‌ లేదా యాప్‌ గురించి సాధారణ ఇంగ్లిష్‌లో టైప్‌ చేసినా, నోటితో చెప్పినా సరిపోతుంది. ఉదాహరణకు దుస్తులు అమ్ముకునే వెబ్‌సైట్‌ కావాలి. సైజులు ఎంపిక చేసుకునే సదుపాయం ఉండాలి. బటన్లు నీలం రంగులో ఉండాలి అని చెబితే, ఏఐ స్వయంగా కోడ్‌ రాసి వెబ్‌సైట్‌ను రూపొందిస్తుంది. ఈ విధానం వల్ల ప్రోగ్రామింగ్‌ తెలియని వారు కూడా సులభంగా డిజిటల్‌ ఉత్పత్తులను తయారుచేసే అవకాశం పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి



పెట్టుబడులతో దూసుకెళ్లిన కర్సర్‌

అమన్‌ కుటుంబానికి పెట్టుబడుల రంగంలో మంచి అనుభవం ఉంది. ఆయన తండ్రి అరవింద్‌ సాంగర్‌ అమెరికాలో ‘జియోస్ఫియర్‌ క్యాపిటల్‌’ సంస్థను స్థాపించగా, తల్లి శిల్ప కూడా అదే సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. MITలో చదువుతున్నప్పుడు అమన్‌ ‘నియోస్కాలర్‌’ కార్యక్రమానికి ఎంపిక కావడం ద్వారా ప్రముఖ పెట్టుబడిదారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ అనుభవం కర్సర్‌కు భారీ పెట్టుబడులు సమీకరించడంలో సహాయపడింది. అలా గూగుల్‌, ఎన్విడియా, ఓపెన్‌ఏఐ వంటి టెక్నాలజీ దిగ్గజాల మద్దతుతో కర్సర్‌ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని ప్రముఖ ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో 65 శాతం సంస్థలు కర్సర్‌ టెక్నాలజీని వినియోగించడం ప్రారంభించాయి. దీంతో సంస్థ విలువ అనూహ్యంగా పెరిగింది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కర్సర్‌ విలువ రూ.5.5 లక్షల కోట్లకు చేరుకోవడం స్టార్టప్‌ ప్రపంచంలో అరుదైన ఘనతగా నిలిచింది. ఈ విజయంతో అమన్‌ సాంగర్‌ ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచాడు.

గూగుల్‌లో ఉద్యోగాన్ని వదిలేయడం, చదువును మధ్యలోనే ఆపేయడం ప్రతి ఒక్కరికీ సరైన నిర్ణయం కాకపోవచ్చు. కానీ తన సామర్థ్యాన్ని నమ్ముకుని, సరైన సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా అమన్‌ సాంగర్‌ అసాధారణ విజయాన్ని సాధించాడు. కష్టపడి పనిచేస్తే, కొత్త ఆలోచనలకు రూపమిస్తే ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చని అమన్‌ కథ మరోసారి నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *