కాలం ఎప్పుడు ఎవరిని ఎలా బలితీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు. ఒకరి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన సమయం.. ఇంకొకరి ఇంట్లో పచ్చని పసుపు తాడు కూడా ఆరని సమయం.. కానీ, విధి ఎంత క్రూరంగా మారిందంటే.. ఆ రెండు కుటుంబాల సంతోషాలను నడిరోడ్డుపై చిన్నాభిన్నం చేసింది. కూతురి పెళ్లి పత్రికలు పంచుతూ.. ఆ పెళ్లిని కళ్లారా చూడాలనుకున్న ఓ తండ్రి ఆశలు.. మూడు నెలల క్రితమే పెళ్లయి, భార్యతో నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలనుకున్న ఓ నవవరుడి కలలు.. రెండూ ఒకే ఒక్క ప్రమాదంలో, క్షణాల వ్యవధిలో శ్మశాన వైరాగ్యంగా మారిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకరి ఇంట్లో పెళ్లి పనుల్లో సంతోషం నింపాల్సిన తండ్రి, మరొకరి జీవితంలో కొత్త వెలుగులు నింపాల్సిన నవ వరుడు.. మృత్యువు రూపంలో ఎదురైన ఆ ఘోర ప్రమాదంతో అర్ధంతరంగా ప్రాణాలు వదిలారు. ఎమ్మిగనూరు మండలం బనవాసి ఎస్సీ కాలనీ సమీపంలో ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రభుదాస్ (38) తన రెండవ కుమార్తె వివాహ పనుల్లో భాగంగా పెళ్లి పత్రికలు పంచే బాధ్యతను నెరవేర్చుకుని ఆనందంగా తిరిగి పెద్దకడబూరుకు వెళుతుండగా విధి వక్రించింది.
అటు చిన్నతుంబలం గ్రామానికి చెందిన రవి(25)కి వివాహమై కేవలం మూడు నెలలే అవుతోంది. భార్య పుట్టినిల్లు ఆస్పరి మండలం కారుమంచికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృత్యువు అతడిని బలితీసుకుంది. పెళ్లి పత్రికలు పంచుతూ కూతురి వివాహాన్ని కళ్లారా చూడాలనుకున్న తండ్రి, మూడు నెలల క్రితమే ఏడడుగులు నడిచి భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ఆశించిన యువకుడు.. ఇలా ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదలడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
