తెలంగాణలో ఎండలు ఎంతగా మండాయో.. బీర్ అమ్మకాలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. వేసవి ప్రభావంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా బీర్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయ వృద్ధి నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.3,618.41 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.3,272.33 కోట్లతో పోలిస్తే 10.58 శాతం అధికం. ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణం బీర్ విక్రయాల పెరుగుదలేనని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
2025 ఏప్రిల్‌లో 46.46 లక్షల కేసులుగా ఉన్న బీర్ అమ్మకాలు.. 2026 ఏప్రిల్‌లో 56.21 లక్షల కేసులకు చేరుకున్నాయి. అంటే ఏకంగా 20.99 శాతం వృద్ధి నమోదైంది. వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, వినియోగదారుల డిమాండ్ పెరగడం ఇందుకు కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) అమ్మకాలు మాత్రం పెద్దగా పెరగలేదు. గత ఏడాది 31.18 లక్షల కేసులుగా ఉన్న విక్రయాలు ఈ ఏడాది 31.07 లక్షల కేసులకే పరిమితమయ్యాయి. దీంతో బీర్ అమ్మకాలే మొత్తం మద్యం విక్రయాల్లో వృద్ధికి కీలకంగా మారాయి. ఏప్రిల్ 30న ఒక్కరోజే మద్యం అమ్మకాలు రూ.423.57 కోట్లకు చేరుకోవడం విశేషం. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే ఇది 22.20 శాతం ఎక్కువ.
అలాగే బీర్ అమ్మకాలు 5.04 లక్షల కేసులకు చేరుకుని 58.49 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మే నెలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. మే 25 వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా రూ.2,695.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.2,335.39 కోట్లతో పోలిస్తే ఇది 15.4 శాతం ఎక్కువ. వేసవి కాలంలో బీర్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో వర్షాకాలం ప్రారంభమైతే అమ్మకాల ధోరణిలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం బీర్ విక్రయాలే తెలంగాణ మద్యం మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
