తాజావార్తలు

Telangana: హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లేవారికి సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై టెన్షన్ అవసరం లేదు..


హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి భారీ ఊరట కలగలనుంది. ఈ హైవే ఎన్‌హెచ్-65పై 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకురానుంది. నకిరేకల్ వద్ద నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.32 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఇది అందుబాటులోకి రానుండటంతో హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లోనే బాధితులకు చికిత్స అందించేందుకు సహాయపడునుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే చికిత్స అందకపోవడంతో చాలామంది మరణిస్తున్నారు. ఈ ఆస్పత్రి రాకతో ఇలాంటి సమయాల్లో సత్వర చికిత్స అందించేందుకు ఉపయోగపడనుంది.

ప్రస్తుతం నేషనల్ హైవేపై నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి వద్ద రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు క్షతగాత్రులను నల్గొండ లేదా హైదరాబాద్‌కు చికిత్స కోసం తరలించాల్సి వస్తోంది. దీంతో వెంటనే వైద్యం అందక చాలామంది మరణిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆస్పత్రి రాకతో ఆ ఇబ్బంది ఉండదు గోల్డెన్ అవర్‌లోనే చికిత్స అందించడం వల్ల ప్రాణనష్టం జరగకుండా బాధితులను కాపాడే అవకాశం ఉంటుంది. హైవేపై వెళ్లే ప్రయాణికులకు కాకుండా నకిరేకల్ చుట్టపక్కల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ ఆస్పత్రి రాకతో ప్రయోజనం చేకూరనుంది. ఈ గవర్నమెంట్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సర్వీసులతో పాటు ట్రామా కేర్, ఐసీయూ, ఆర్థోపెడిక్‌తో పాటు సర్జరీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక డయాగ్నోస్టిక్ సేవలు కూడా ఇందులో ఉన్నాయి. డిజిటల్ ఎక్స్‌రే, స్కానింగ్, 24 గంటల పాథాలజీ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది.

ఇక గర్బిణుల కోసం ప్రసూతి సేవలు, శిశువుల కోసం ప్రత్యేక సేవలు కూడా ఈ ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. నకిరేకల్ చుట్టపక్కల మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆస్పత్రి ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. రోగుల సంఖ్య ఎక్కువ కావంతో ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ఆస్పత్రిని 100 పడకలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. 5 నెలల క్రితం నిర్మాణ పనులు పూర్తవ్వగా.. ఇప్పుడు రోజుకు 250 వరకు ఓపీ వస్తుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు ప్రారంభమైతే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022లో ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు పనులు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నారు. మొత్తానికి ఈ 100 పడకల ఆస్పత్రి రాకతో హైవేపై వెళ్లేవారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఊరట కలగనుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *