ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు పెను సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ మాజీ అధికారిక నివాసం ‘6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్’ బంగ్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ భవనాన్ని రాష్ట్ర అతిథి గృహంగా (స్టేట్ గెస్ట్ హౌస్‌గా) మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉన్న సమయంలో, గత ప్రభుత్వ హయాంలో భారీ ఖర్చుతో ఈ బంగ్లాను పునరుద్ధరించడంపై సీబీఐ (CBI) విచారణ కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని వృథా పోనివ్వకుండా మరో అవసరానికి వినియోగించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ విలాసవంతమైన బంగ్లాను స్టేట్ గెస్ట్ హౌస్‌గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వ అతిథి గృహానికి అనుకూలంగా ఉండేలా విశాలమైన పార్కింగ్ సదుపాయాలు, వెయిటింగ్ హాళ్లు, ఇతర వసతుల కల్పనను ఈ ప్రతిపాదనలో చేర్చారు. ఇతర ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ల మాదిరిగానే, ఢిల్లీని సందర్శించే ఇతర రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులకు నిర్ణీత రుసుముతో ఇక్కడ వసతి కల్పిస్తారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేబినెట్ ఆమోదం కోసం వేచి ఉంది. బంగ్లా ప్రస్తుతం ఖాళీగా ఉన్నప్పటికీ, దీని రోజువారీ శుభ్రత, రిఫ్రిజిరేటర్లు, సెంట్రల్ ఎయిర్ కండీషనర్లు వంటి ఖరీదైన విద్యుత్ పరికరాల నిర్వహణ కోసం సుమారు 10 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. నిర్వహణ ఖర్చులు భారం కావడం, ప్రజాధనంతో నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉండటంతో దీనిని వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివాదాల ‘షీష్ మహల్’
గత ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ హయాంలో ఈ అధికారిక నివాసానికి జరిగిన ఖరీదైన పునరుద్ధరణ పనులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అత్యంత విలాసవంతమైన హంగులతో, కోట్లాది రూపాయల ప్రజాధనంతో దీనిని నిర్మించారంటూ అప్పట్లో ప్రతిపక్ష బీజేపీ దీనిని ‘షీష్ మహల్’ అని పిలుస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. “ఆమ్ ఆద్మీ అంటూ అధికారంలోకి వచ్చి విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నారంటూ అసెంబ్లీ ఎన్నికలలో ఈ ‘షీష్ మహల్’ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇది ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయినప్పటికీ, ‘షీష్ మహల్’ వివాదం కారణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ నివాసాన్ని ఉపయోగించడం లేదు.
2022లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఢిల్లీ విజిలెన్స్ విభాగం ఈ భవన నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక విచారణ చేపట్టింది. ఆ తర్వాత, నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించారంటూ అప్పటి ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై లోతైన దర్యాప్తు జరుపుతోంది. ఒకవైపు విచారణ సాగుతుండగానే, మరోవైపు ఈ వివాదాస్పద బంగ్లాను ప్రజాప్రతినిధుల విడిది కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
