తాజావార్తలు

Hyderabad: SIR పేరుతో మోసాలు.. ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు..

Hyderabad: SIR పేరుతో మోసాలు.. ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు..


స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్, జిల్లా ఎన్నికల అధికారులు హెచ్చరించారు. ఓటరు వివరాల ధృవీకరణ పేరుతో మోసగాళ్లు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు అడిగే అవకాశం ఉందని, అలాంటి కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు), ఎన్నికల సిబ్బంది పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో పేరు సరిచేయడం, వివరాలు అప్‌డేట్ చేయడం, ధృవీకరణ చేయడం వంటి కారణాలు చెబుతూ ఓటీపీ అడిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని హెచ్చరించారు. ఎన్నికల అధికారులు ఎప్పటికీ ఫోన్ ద్వారా ఓటీపీలు, బ్యాంకు వివరాలు లేదా ఇతర రహస్య సమాచారాన్ని అడగరని తెలిపారు.

“మీ ఓటు ఎంత విలువైనదో.. మీ వ్యక్తిగత సమాచారం కూడా అంతే విలువైనది. SIR-2026 పేరుతో మోసగాళ్లకు అవకాశం ఇవ్వొద్దు. ఒకసారి ఓటీపీ పంచుకుంటే మీ డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది” అని సీవీ సజ్జనార్ పేర్కొన్నారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కాల్‌ను నిలిపివేసి 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సూచించారు. అలాగే ఓటర్లకు సంబంధించిన సేవలు, ధృవీకరణలు, వివరాల నవీకరణ కోసం కేవలం భారత ఎన్నికల సంఘం అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఏ పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దని, సైబర్ మోసాలపై కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా అవగాహన కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *