మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో పలు సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. వాటిలో ఒకటి కాదు, ఐదు చిత్రాలున్నాయి. అయితే, అన్నింటిలోకి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఆయన హాలీవుడ్ చిత్రం ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్. ఒక తెలుగు హీరో హాలీవుడ్ చిత్రంలో నటించడం అరుదైన విషయమే. అలాంటి అవకాశం 25 ఏళ్ల ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవికి లభించింది. చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టిస్తుందని అందరూ భావించిన ఈ హాలీవుడ్ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడం దురదృష్టకరం. అమెరికాలో స్థిరపడిన కె. రమేష్ కృష్ణమూర్తి, సుందరస్వామి, గణేష్ మహాదేవన్ అనే ముగ్గురు భారతీయులకు ఈ చిత్ర నిర్మాణం ఆలోచన వచ్చింది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో, మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 43 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆంగ్ల చిత్రాన్ని నిర్మించాలని ఈ నిర్మాతల త్రయం సంకల్పించింది. 1940లో వచ్చిన ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం నాటి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఆ సినిమాకు ఆధునిక సాంకేతిక విలువలు జోడించి ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రాన్ని నిర్మించాలని, నిర్మాతలు భారీ ప్రణాళికలతో అడుగు ముందుకు వేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తెలుగు వెర్షన్‌కు అబూ బాగ్దాద్ గజదొంగగా టైటిల్ ఖరారు చేశారు. హాలీవుడ్ దర్శకుడు డచన్ గెర్సీని ఆంగ్ల వెర్షన్‌కు, సురేష్ కృష్ణను తెలుగు వెర్షన్‌కు దర్శకులుగా ఎంపిక చేసుకున్నారు. 90 నుంచి 100 నిమిషాల నిడివితో ఇంగ్లీష్ వెర్షన్‌ను, రెండున్నర గంటల నిడివితో తెలుగు వెర్షన్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ వెర్షన్లో పాటలు ఉండవు. అయితే, తెలుగు వెర్షన్లో మాత్రం ఐదు పాటలు, కామెడీ సీన్లు ఉండాలని, దీన్ని తమిళ, హిందీ భాషల్లోకి డబ్ చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రూపొందించారు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను ఎన్నుకున్నారు. ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం విడుదలై ఉంటే, ఏఆర్ రెహమాన్‌కు అదే తొలి హాలీవుడ్ చిత్రం అయ్యేది.
1940లో వచ్చిన ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రంలో సాబు అనే భారతీయుడు హీరోగా నటించాడు. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోవాలని అతని కుమార్తె జాస్మిన్ సాబు తండ్రి గురించి, ఆ సినిమా గురించి ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం ఈ చిత్ర దర్శకుడు డచన్ గెర్సీను ఆకర్షించింది. దాని ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ తయారు చేశారు. కేమ్లాట్, కింగ్ కాంగ్, స్టార్ ట్రెక్ వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ క్లీన్ను ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా, అలాగే టుమారో నెవర్ డైస్, మమ్మీ చిత్రాలకు పనిచేసిన గెయిల్స్ మాస్టర్‌ను ప్రొడక్షన్ డిజైనర్‌గా ఎన్నుకున్నారు. ఇలా అన్ని నిర్ణయించుకున్న తర్వాత, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 1999 ఆగస్టు 21 రాత్రి మద్రాసులో ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం వివరాలను నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ చిత్ర ప్రముఖులతో పాటు బాలీవుడ్ నటుడు గోవిందా కూడా హాజరయ్యారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు అందరి సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేశారు చిరంజీవి. కాలిఫోర్నియా నృత్య కళాకారుల బెల్లీ నృత్య ప్రదర్శన ఆ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత అంటే అక్టోబర్ 4న రామోజీ ఫిలిం సిటీలో ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ షూటింగ్ మొదలైంది. లాంఛనంగా ఆ రోజు షూటింగ్ ప్రారంభించినా, అక్టోబర్ 11 నుంచి రాజస్థాన్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, అప్పట్లో పెప్సీ మోడల్‌గా ఉన్న షాజాన్ ఒక హీరోయిన్గా, మనీషా కోయిరాలను మరో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా విడుదలై ఉంటే మనీషాకు తెలుగు, హాలీవుడ్‌లలో ఇదే తొలి చిత్రమై ఉండేది. హాలీవుడ్ చిత్రం బిజినెస్ విషయం అలా ఉంచితే, అబూ బాగ్దాద్ గజదొంగ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు పోటీపడ్డారు. తెలుగు సినిమా బిజినెస్ 7, 8 కోట్ల రూపాయలు జరుగుతున్న సమయంలో అబూకు రికార్డ్ స్థాయిలో దాదాపు 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు రావడం విశేషం. రాజస్థాన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలతో రూపొందించిన ఒక ట్రైలర్ ఈ క్రేజ్‌కు కారణం. 25 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యి.. అంతా బాగా జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో జరిగిన కొన్ని మత పరమైన వివాదాలు.. సినిమా నిర్మాణ వేగాన్ని తగ్గించాయి. అలాగే నిర్మాతల మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలు సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణమయ్యాయి. చరిత్ర సృష్టిస్తుందనుకున్న మెగాస్టార్ హాలీవుడ్ చిత్రం అలా అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఇది జరిగి 25 ఏళ్లు దాటింది. ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ నిర్మాణం ముగిసిన అధ్యాయం అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే ప్రస్తుతం చిరు వరుస చిత్రాలు చేస్తూ ఉండంటంతో.. హాలీవుడ్ చిత్రంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరించబడే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
